రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ (DSP) తన ఇండియా టూర్ లో భాగంగా హైదరాబాద్, బెంగుళూరు తర్వాత విశాఖపట్నం లో పర్ఫార్మెన్స్ ఇవ్వాలని ప్లాన్ చేశారు. ‘‘వస్తున్నా వైజాగ్.. నా బుజ్జి ఫ్యాన్స్యూ..’’ అంటూ ఎనౌన్స్ చేసిన డీఎస్పీకి అనూహ్యంగా షాక్ తగిలింది. ఏప్రిల్ 19న జరగాల్సిన ఈ లైవ్ మ్యూజిక్ కాన్సెర్ట్ కు విశాఖ పోలీసులు భద్రతా కారణాల దృష్ట్యా అనుమతి నిరాకరించారు.

ఈ ఈవెంట్ విశ్వనాథ స్పోర్ట్స్ క్లబ్ స్టేడియంలో జరగాల్సి ఉండగా.. ఇదే ప్రాంగణంలో ఇటీవల జరిగిన ఓ ప్రమాదంలో ఆరేళ్ల బాలుడు నీటమునిగి మృతి చెందాడు. దాంతో భద్రతపై సందేహాలు వ్యక్తమవడంతో అనుమతి ఇచ్చేందుకు పోలీసులు వెనకాడారు. స్టేడియంలోని వసతులు, ఎంట్రీ-ఎగ్జిట్ మార్గాలు, పార్కింగ్, సీసీ కెమెరాలు, ఫైర్ సేఫ్టీ వంటి అంశాలపై అభ్యంతరాలు తెలిపారు.

నిర్వాహకులు పోలీసుల సూచనల మేరకు కచ్చితమైన భద్రతా ఏర్పాట్లు చేస్తే మాత్రం అనుమతి ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్లు ఈస్ట్ ఏసీపీ స్పష్టం చేశారు. ఇప్పటికే టికెట్లు పెద్ద సంఖ్యలో అమ్ముడవ్వడంతో నిర్వాహకులు వేదిక మార్చడం కష్టం అనే అభిప్రాయంతో ఉన్నారు. డీఎస్పీ ఫ్యాన్స్ మధ్య ఇది ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.