ఏప్రిల్ 17వ తేదీ నుంచి ఐదు రోజుల పాటు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కుటుంబంతో కలిసి ఓ ప్రత్యేక విదేశీ పర్యటనకు వెళ్లనున్నారు. ఈ పర్యటన ఆయన 75వ వజ్రోత్సవ జన్మదినం సందర్భంగా జరగనుంది. ఏప్రిల్ 20న తన పుట్టినరోజు కానుకగా, కుటుంబ సభ్యులతో కలిసి ప్రైవేట్‌గా గడపాలని ఆయన నిర్ణయించుకున్నారు.

చంద్రబాబు 75 ఏళ్ల వయస్సు పూర్తిచేసుకోవడం ఒక వ్యక్తిగత, రాజకీయ జీవితంలో మైలురాయి కావడంతో, భారీ వేడుకలు కాకుండా కుటుంబం మధ్యలో ఆనందంగా గడపాలనే ఆలోచనతో విదేశీ పర్యటన ప్లాన్ చేసినట్టు సమాచారం. ముఖ్యమంత్రి తన భార్య భువనేశ్వరి, కుమారుడు నారా లోకేష్, కోడలు బ్రాహ్మణి, మనవడు దేవాన్ష్‌తో కలిసి ఏప్రిల్ 17 వ తేదీ ఉదయం 1:15కి ఢిల్లీ విమానాశ్రయం నుంచి బయలుదేరతారు. ఈ పర్యటన ముగిసిన తర్వాత ఏప్రిల్ 21 అర్ధరాత్రి అమరావతికి తిరిగివస్తారు.
గత పదినెలలుగా పాలనపై పూర్తిగా దృష్టి పెట్టిన చంద్రబాబు.. ఈ సారి కొంత సమయాన్ని కుటుంబంతో గడపాలని నిర్ణయించారు. ముఖ్యంగా మనవడు దేవాన్ష్ ఎదుగుతున్న సమయంలో కుటుంబానికి సమయం కేటాయించడం ఆయన మానవీయతకు నిదర్శనం. ముఖ్యమంత్రి పదవిని చేపట్టిన తర్వాత ఇదే ఆయన తొలి విదేశీ పర్యటన కావడం గమనించదగిన విషయం. రాజకీయ హడావుడి లేకుండా కుటుంబంతో స్వచ్ఛందంగా పుట్టినరోజు జరుపుకోవడంలో ఆయన అనుసరించిన తీరు మరెందరికో ప్రేరణ కలిగించవచ్చు.