టాలీవుడ్ సీనియర్ నటి, కాంగ్రెస్ ఎమ్మెల్సీ విజయశాంతి, భర్త శ్రీనివాస్ ప్రసాద్‌ను బెదిరించిన వ్యక్తిపై బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. చంద్రశేఖర్ అనే వ్యక్తి తనను, భార్య విజయశాంతిని చంపుతానని, పరువు బజారుకీడుస్తానని, అడిగినంత డబ్బు ఇవ్వకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని మెసేజులు పంపుతున్నాడని శ్రీనివాస్ ప్రసాద్ ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

శ్రీనివాస్ ప్రసాద్ మాట్లాడుతూ – చంద్రశేఖర్ అనే వ్యక్తి ఇటీవల పరిచయమయ్యాడని, సోషల్ మీడియాలో విజయశాంతికి ప్రచారం చేస్తానని చెప్పాడని తెలిపారు. పనితీరు బాగుంటే సంపూర్ణ కాంట్రాక్ట్ ఇస్తామని చెప్పారు. కొద్ది రోజులు పని చేసిన అనంతరం, అతడి పని నచ్చకపోవడంతో అతడిని ఆఫీసు నుంచి పంపించారని వెల్లడించారు.
అయితే కొంతకాలం సైలెంట్‌గా ఉన్న చంద్రశేఖర్ తిరిగి బయటకు వచ్చి డబ్బులు ఇవ్వకపోతే మీ ఇద్దరినీ చంపేస్తానంటూ బెదిరిస్తున్నాడని ఆరోపించారు. మెసేజ్‌లు, కాల్స్ ద్వారా బెదిరింపులకు పాల్పడుతున్నట్లు వివరించారు. ఈ మేరకు బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేయగా, పోలీసులు చంద్రశేఖర్‌పై కేసు నమోదు చేశారు.
ఇక విజయశాంతి ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్సీగా ఉన్నారు. రాజకీయాల్లో యాక్టివ్‌గా ఉన్న ఆమె, నటనకు తిరిగి వచ్చారు. కళ్యాణ్ రామ్ హీరోగా నటిస్తున్న “సన్ ఆఫ్ వైజయంతి” సినిమాలో పవర్ఫుల్ పోలీస్ అధికారిణి పాత్రలో కనిపించనున్నారు. ఈ చిత్రం ఏప్రిల్ 18న విడుదల కానుంది.













