తెలంగాణలో కొమురవెల్లి, బల్కంపేట, బాసర వంటి ప్రముఖ ఆలయాల్లో టికెట్ల దందాలు వెలుగులోకి రావడంతో రాష్ట్ర ప్రభుత్వం కఠిన నిర్ణయం తీసుకుంది. ఇకపై అన్ని ఆలయ సేవల టికెట్లను ఆన్లైన్లో అందుబాటులోకి తీసుకురావాలని ఎండోమెంట్ శాఖ ప్రణాళిక సిద్ధం చేస్తోంది. మాన్యువల్ టికెట్లను మళ్లీ వాడడం, నకిలీ టికెట్ల వినియోగం వంటి అక్రమాలకు అడ్డుకట్ట వేయడమే లక్ష్యం.

ఈ నెల 15న దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ ఎండోమెంట్ అధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు. ఆ సమీక్ష అనంతరం అధికారిక ఉత్తర్వులు వెలువడే అవకాశం ఉంది. భక్తులు ఆలయాల వద్ద బారులు తీరాల్సిన అవసరం లేకుండా ఆన్లైన్లోనే సేవలను బుక్ చేసుకునే సదుపాయం కల్పించనున్నారు. దీనివల్ల పారదర్శకతతో పాటు ఆదాయ, ఖర్చుల పర్యవేక్షణ మరింత పటిష్టంగా ఉంటుంది.
ప్రస్తుతం వేములవాడ, యాదగిరిగుట్ట, భద్రాచలం, బాసర వంటి ఆలయాల్లో వీఐపీ టికెట్ల దందా పెద్ద మోతాదులో సాగుతోంది. రూ.500 టికెట్లను రూ.2000 నుంచి రూ.5000 వరకూ విక్రయిస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. ఈ మధ్య బల్కంపేట ఎల్లమ్మ ఆలయంలో నకిలీ టికెట్లతో రూ.31,000 వరకు వసూలు చేసిన ఘటన సంచలనంగా మారింది. అలాగే చెర్వుగట్టు దేవాలయంలో టికెట్ల రీసైక్లింగ్, పార్కింగ్ ఫీజుల దందాలు బయటపడ్డాయి. బాసర ఆలయంలో లడ్డూ టికెట్లపై అక్రమాల వల్ల ఉద్యోగుల సస్పెన్షన్, తొలగింపులు చోటు చేసుకున్నాయి.
అంతేగాక, వీఐపీ టికెట్ల కేటాయింపులో స్పష్టత లేకుండా ఉండటంతో, కొందరు సిబ్బంది ఇదే అవకాశాన్ని డబ్బుగా మార్చుకుంటున్నారు. ఆలయాల్లో పదేళ్లకు పైగా విధులు నిర్వహిస్తున్న సిబ్బంది కొంతమంది దుర్వినియోగం చేస్తున్నారన్న ఆరోపణలపై విచారణ జరిపే అవకాశం ఉంది. ఆలయాల్లో పునరుద్ధరణ కంటే, సేవా విధానాల పారదర్శకత ఇప్పుడు అవసరం అని భక్తులు డిమాండ్ చేస్తున్నారు.