తెలంగాణలోని ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో భవిష్యత్తులో భారీ భూకంపం సంభవించే అవకాశం ఉందని ‘ఎర్త్‌క్వేక్ రీసెర్చ్ అండ్ అనాలసిస్’ అనే సంస్థ హెచ్చరికలు జారీ చేసింది. ఈ సంస్థ సోషల్ మీడియా వేదికగా చేసిన ప్రకటన ప్రకారం, రామగుండం పరిసర ప్రాంతాల్లో భూకంప తీవ్రత అధికంగా ఉండే అవకాశం ఉందని పేర్కొంది. ఈ ప్రకంపనలు హైదరాబాద్, వరంగల్, అమరావతి సహా మహారాష్ట్రలోని కొంత భాగానికి కూడా విస్తరించవచ్చని అంచనా వేసింది. అయితే ఈ విషయాన్ని కేంద్ర ప్రభుత్వం, భారత వాతావరణ శాఖ (IMD) లేదా జాతీయ భూగర్భ శాస్త్ర సంస్థలు ఇంకా ధృవీకరించలేదు.

భూకంపాలను ఖచ్చితంగా ముందస్తుగా అంచనా వేయడం శాస్త్రీయంగా అసాధ్యమనే అభిప్రాయం శాస్త్రవేత్తలది. అయినప్పటికీ, భూమిలో ఫాల్ట్ లైన్లు ఉండే ప్రాంతాల్లో అనూహ్య ప్రకంపనలు సంభవించవచ్చు. గోదావరి నదీ పరివాహక ప్రాంతంలో భూకంపాలకు కారణమయ్యే ఫాల్ట్ జోన్‌లు ఉండటం వల్ల అప్పుడప్పుడు స్వల్ప ప్రకంపనలు సంభవించడం సహజం.
డిసెంబర్ 4, 2024న ములుగు జిల్లా మేడారం దగ్గర 5.3 తీవ్రతతో వచ్చిన భూకంపం ప్రజలలో కలకలం రేపింది. దీని ప్రభావం హైదరాబాద్, ఖమ్మం, వరంగల్‌తో పాటు ఆంధ్రప్రదేశ్‌లోని కొన్ని ప్రాంతాల్లో కూడా కనిపించింది. ఇదే సమయంలో పెద్దపల్లి జిల్లాలో భారీ భూకంపం సంభవించే అవకాశం ఉందని “ఎర్త్‌క్వేక్ రీసెర్చ్ అండ్ అనాలసిస్” చేసిన ట్వీట్ వైరల్‌గా మారింది.
తెలంగాణ రాష్ట్రం ప్రధానంగా భూకంప తీవ్రత తక్కువగా ఉన్న జోన్-2లోకి వస్తుంది. కానీ గతంలో కూడా ఈ ప్రాంతాల్లో స్వల్ప భూకంపాలు నమోదయ్యాయి. 1969లో ప్రకాశం జిల్లా ఒంగోలు వద్ద 5.1 తీవ్రతతో, 1998లో ఆదిలాబాద్‌లో 4.5 తీవ్రతతో భూకంపాలు సంభవించాయి. 1984, 1999, 2013లో హైదరాబాద్ పరిసరాల్లో స్వల్ప ప్రకంపనలు నమోదు కావడం జరిగింది.
శాస్త్రవేత్తలు చెబుతున్న దాని ప్రకారం, భూకంపాల గురించి ముందుగానే తెలియజేయడం చాలా కష్టం. కానీ అప్రమత్తంగా ఉండడం, భూకంప భద్రతా మార్గదర్శకాలను పాటించడం ద్వారా ముప్పును తగ్గించుకోవచ్చని సూచిస్తున్నారు. భయపడాల్సిన అవసరం లేదని, అధికారిక సంస్థల ప్రకటనలపై మాత్రమే ఆధారపడాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు.