రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మరియు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కుమారుడు మార్క్ శంకర్ ప్రమాదవశాత్తు గాయాలపాలయ్యాడు. సింగపూర్‌లోని ఓ పాఠశాలలో జరిగిన అగ్నిప్రమాదంలో మార్క్ శంకర్ చిక్కుకుపోయాడు. ఈ ఘటనలో ఆయన చేతులు, కాళ్లకు గాయాలయ్యాయి. పొగ ఊపిరితిత్తుల్లోకి చొచ్చుకెళ్లడంతో శ్వాస సంబంధిత సమస్యలు ఏర్పడ్డాయి. దీంతో వెంటనే స్థానిక ఆసుపత్రికి తరలించి అత్యవసర వైద్యం అందిస్తున్నారు.

ఈ విషయం తెలుసుకున్న పవన్ కళ్యాణ్, ప్రస్తుతం కొనసాగుతున్న అల్లూరి సీతారామరాజు జిల్లా పర్యటనను తాత్కాలికంగా నిలిపేశారు. పార్టీ నాయకులు, అధికారులు సింగపూర్ వెళ్లాలని సూచించగా, పవన్ ముందుగా అరకు సమీపంలోని కురిడి గ్రామాన్ని సందర్శించి, అక్కడి గిరిజనులతో మాటలడగాలని నిర్ణయించుకున్నారు. నిన్న గిరిజనులకు ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటూ, గ్రామ సమస్యలు తెలుసుకోవాలని భావించారు.
అలాగే, అక్కడ నిర్వహించాల్సిన అభివృద్ధి కార్యక్రమాలను పూర్తి చేసి, విశాఖపట్నం చేరుకుని అక్కడి నుంచి సింగపూర్ బయలుదేరనున్నారు. కుమారుడి ఆరోగ్య పరిస్థితిని స్వయంగా తెలుసుకోవడానికి పవన్ కళ్యాణ్ సింగపూర్ వెళ్తున్నారు.