ప్లేటులో రొయ్యల కర్రీ రుచి చూడాలంటే… ఇప్పుడు వర్రీ అయ్యే పరిస్థితి. ఎందుకంటే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తీసుకున్న నిర్ణయం రొయ్యల రైతులపై బాదుడు మోపుతోంది. ఇప్పటివరకు 3 శాతం ఉన్న దిగుమతి సుంకాన్ని ఒక్కసారిగా 26 శాతానికి పెంచేశాడు. దీంతో లక్ష రూపాయల విలువ చేసే రొయ్యల ధర ఇప్పుడు లక్షా 26 వేలకు పెరిగిపోయింది. రవాణా, ప్యాకింగ్ ఖర్చులతో కలిపితే మొత్తం ఖర్చు 50 శాతం పెరిగింది.

ఈ ప్రభావంతో ఎగుమతి దారులు కేజీకి రూ.30 నుంచి రూ.50 వరకు ధరలు తగ్గించేసి రైతుల్ని ఇబ్బందుల్లోకి నెట్టేశారు. మార్కెట్‌లో రొయ్య ధర ఒక్కసారిగా పడిపోయింది. ఈ నెల 9 నుంచి కొత్త సుంకం అమలులోకి రానుంది. ఏపీ నుంచి అమెరికాకు ఏటా 17.2 లక్షల టన్నుల వనామీ రొయ్యలు ఎగుమతి అవుతుంటే, ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా నుంచే రోజుకు 2 వేల టన్నుల రొయ్యలు బయలుదేరుతుంటాయి.
ఈ పరిస్థితుల నేపథ్యంలో ఆక్వా రంగాన్ని రక్షించేందుకు ఏపీ సీఎం చంద్రబాబు కేంద్ర మంత్రి పీయూష్ గోయల్‌కు లేఖ రాశారు. అమెరికా విధించిన 27% సుంకాన్ని ఉపసంహరించాలని, ఆక్వా ఉత్పత్తులకు మినహాయింపు ఇవ్వాలని కోరారు. రాష్ట్ర GDPలో మత్స్యరంగం 11% వాటా కలిగి ఉందని వివరించారు. అధిక సుంకాల వల్ల విదేశీ ఆర్డర్లు రద్దవుతుండగా, శీతల గిడ్డంగుల్లో నిల్వకూ స్థలాభావం ఏర్పడిందని తెలిపారు.
కేంద్రం చర్యలు తీసుకుంటుందని సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ హామీ ఇచ్చారు. అయితే, రైతుల పరిస్థితిపై కూటమి ప్రభుత్వం స్పందించడంలేదని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ప్రభుత్వ అనుకూల వర్గాలు సిండికేట్‌లుగా మారాయని విమర్శించారు. రైతులకు అండగా నిలుస్తామని తెలిపారు.














