SRH vs HCA మధ్య గత కొన్ని రోజులుగా కొనసాగుతున్న ఫ్రీ పాస్‌ల వివాదానికి ఎట్టకేలకు ముగింపు లభించింది. HCA సెక్రటరీ దేవరాజ్, SRH ప్రతినిధులతో సమావేశమై వివాదాన్ని పరిష్కరించారు. త్రైపాక్షిక ఒప్పందం ప్రకారం స్టేడియం సామర్థ్యంలో 10% టిక్కెట్లు HCAకి కేటాయించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. అలాగే, HCA నుంచి SRH ఎదుర్కొన్న సమస్యలపై కూడా చర్చించడానికి అంగీకరించారు. ఈ పరిణామంతో HCAకి 3,900 ఫ్రీ పాస్‌లను SRH అందించేందుకు సిద్ధమైంది.

ఈ ఫ్రీ పాస్‌ల వివాదం కారణంగా SRH యాజమాన్యం, HCAపై తీవ్ర ఆరోపణలు చేసింది. HCA ప్రెసిడెంట్ జగన్మోహన్ రావుపై బెదిరింపులు, బ్లాక్‌మెయిల్ ఆరోపణలు పెట్టడంతో వివాదం మరింత తీవ్రతరమైంది. టికెట్‌లను బలవంతంగా కోరితే, హైదరాబాద్‌ను వదిలి వేరే రాష్ట్రంలో హోమ్ గ్రౌండ్‌గా ఎంచుకునే అవకాశముందని SRH హెచ్చరించింది. HCA కూడా తీవ్రంగా స్పందించింది. ఒప్పందం ప్రకారం టిక్కెట్లు అడిగితే బ్లాక్‌మెయిల్ ఎలా అవుతుందంటూ ఎదురు వాదించింది.
ఈ వివాదంపై తెలంగాణ ప్రభుత్వం కూడా స్పందించింది. హైదరాబాద్ పరువుకు భంగం కలిగేలా ఎవరైనా ప్రవర్తించినా సహించబోమని స్పష్టం చేస్తూ, విజిలెన్స్ విచారణకు ఆదేశించింది. విజిలెన్స్ డీజీ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో విచారణ మొదలైంది. ఉప్పల్ స్టేడియానికి వెళ్లిన అధికారులు, HCA సిబ్బందిని విచారించారు. టిక్కెట్ల విక్రయం, బ్లాక్‌లో టిక్కెట్ల అమ్మకం, రోజువారీ పరిపాలనపై దర్యాప్తు చేపట్టారు.
అయితే, ఈ విచారణ నడుస్తుండగానే SRH, HCAకి మెయిల్ పంపి చర్చలు జరుపుదామని సూచించింది. దీంతో ఇరువర్గాల ప్రతినిధులు భేటీ అయ్యి, త్రైపాక్షిక ఒప్పందాన్ని అనుసరించాలని నిర్ణయించుకున్నారు. ఈ ఒప్పందం ప్రకారం, HCAకి 10% ఫ్రీ పాస్‌లు కేటాయించడంతో వివాదానికి ఫుల్‌స్టాప్ పడింది. అదేవిధంగా, SRH, HCA ప్రతినిధులు ఇవాళ ప్రభుత్వ అధికారులతో సమావేశమయ్యే అవకాశం ఉంది. ఈ సమావేశంలో తాజా పరిణామాలపై చర్చించనున్నట్లు సమాచారం.