పిఠాపురం అభివృద్ధికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అమరావతిలో అధికారులతో సమీక్ష నిర్వహించిన ఆయన, పిఠాపురంలో శాంతిభద్రతల పరిరక్షణ, వేసవి కాలం నీటి ఎద్దడి నివారణ, ఇతర అభివృద్ధి కార్యక్రమాలపై చర్చించారు. ఇకపై ప్రతివారం నియోజకవర్గ అభివృద్ధిపై సమీక్ష నిర్వహించాలని పవన్ నిర్ణయించుకున్నారు.

పిఠాపురం పోలీసుల పనితీరుపై వచ్చిన కథనాలను ప్రస్తావించిన పవన్, అవినీతిపరులపై చర్యలు తీసుకోవాలని స్పష్టంగా తెలిపారు. నేరస్తులకు అండగా నిలిచే రాజకీయ నాయకులు, పోలీసులను ఉపేక్షించేది లేదని తేల్చి చెప్పారు. దీంతోపాటు, పిఠాపురంలోని నాలుగు పోలీస్ స్టేషన్ల పరిస్థితులపై ఇంటెలిజెన్స్ నివేదికను సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు.
పిఠాపురం అభివృద్ధి కార్యక్రమాల పురోగతిని అధికారులకు ప్రత్యక్షంగా పరిశీలించాలని పవన్ సూచించారు. ఆయన ఆదేశాలతో, పిఠాపురం పరిధిలో శాంతిభద్రతల సమస్యను ఏపీ డీజీపీ దృష్టికి తీసుకెళ్లనున్నట్లు అర్బన్ డెవలెప్మెంట్ అధికారులు ప్రకటించారు.















