ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో తేలికపాటి వర్షాలు కొనసాగుతున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. ద్రోణి ప్రభావంతో మరికొన్ని రోజులు ఇదే పరిస్థితి కొనసాగనుందని పేర్కొంది. మంగళవారం ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఉరుములు, పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశముందని హెచ్చరించింది.
తెలంగాణలోని ఆసిఫాబాద్, మంచిర్యాల, జగిత్యాల, సిరిసిల్ల, కరీంనగర్, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి, ఖమ్మం, నల్గొండ, వరంగల్, జనగామ, సిద్దిపేట, రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. రాబోయే రెండు రోజులపాటు ఉష్ణోగ్రతలు తక్కువగా నమోదవుతాయని వెల్లడించింది.

ద్రోణి బలహీనపడింది – ఉష్ణోగ్రతల పెరుగుదల
మధ్య ఛత్తీస్గఢ్ నుండి అంతర్గత మహారాష్ట్ర వరకు కొనసాగిన ద్రోణి బలహీనపడిందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం పేర్కొంది. సోమవారం పొడి వాతావరణం ఉండే అవకాశముందని, అయితే తరువాతి రోజుల్లో ఉష్ణోగ్రతలు 2-3 డిగ్రీల వరకు పెరిగే అవకాశం ఉందని తెలిపింది. ఆదిలాబాద్‌లో గరిష్టంగా 38.8°C, హైదరాబాద్‌లో కనిష్టంగా 33.6°C ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశముందని అంచనా వేసింది.
అకాల వర్షాలతో పంట నష్టం
ఈ అకాల వర్షాలు రైతులకు తీవ్ర నష్టాన్ని మిగిల్చాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లో వందల ఎకరాల్లో పంట నష్టపోయింది. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలంలో వర్షం, ఈదురుగాలుల కారణంగా మొక్కజొన్న పంట తీవ్రంగా దెబ్బతింది. మామిడి రైతులు కూడా భారీ నష్టాన్ని ఎదుర్కొన్నారు. మహబూబ్ నగర్ జిల్లా భూత్పూర్ మండలం కరివేన గ్రామంలో వడగండ్ల వాన కారణంగా వరి పంట దెబ్బతింది.
ఏపీలోనూ భారీ పంట నష్టం
ఏపీ పలు జిల్లాల్లోనూ అకాల వర్షాల కారణంగా పంట నష్టం సంభవించింది. పులివెందుల నియోజకవర్గంలోని లింగాల మండలంలో భారీగా అరటిపంట నష్టపోయింది. 2,000 ఎకరాల్లో పంట దెబ్బతిందని రైతులు తెలిపారు. కడప, అనంతపురం, సత్యసాయి, ప్రకాశం జిల్లాల్లోనూ పంట నష్టం నమోదైంది.
పంట నష్టంపై సీఎం చంద్రబాబు సమీక్ష
ఆకాల వర్షాలు, వడగండ్ల వాన కారణంగా రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. కడప, అనంతపురం, సత్యసాయి, ప్రకాశం జిల్లాల్లోని 10 మండలాల్లో 40 గ్రామాల్లో పంట నష్టం జరిగినట్లు అధికారులు వివరించారు. మొత్తం 1,364 మంది రైతులకు చెందిన 1,670 హెక్టార్లలో హార్టికల్చర్ పంటలు దెబ్బతిన్నట్లు గుర్తించామని అధికారులు సీఎంకు తెలియజేశారు. నష్టపోయిన రైతులను ఆదుకునేందుకు తగిన చర్యలు తీసుకోవాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు.