మెగాస్టార్ చిరంజీవి మరో అరుదైన గౌరవాన్ని అందుకున్నారు. సినిమా రంగానికి ఆయన అందించిన విశేష సేవలు మరియు సామాజిక కార్యకలాపాల్లో భాగస్వామ్యం అయినందుకు యూకే పార్లమెంట్‌లోని హౌస్ ఆఫ్ కామన్స్ ఆయనను ఘనంగా సత్కరించింది. ఈ సందర్భంగా చిరంజీవికి ప్రతిష్ఠాత్మక లైఫ్ టైమ్ అచీవ్‌మెంట్ అవార్డును ప్రదానం చేశారు.
ఈ ఘనతకు సినీ ప్రముఖులు, అభిమానులు, నెటిజన్లు చిరంజీవికి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. అయితే, చిరంజీవి క్రేజ్‌ను కొందరు తప్పుగా ఉపయోగించుకునేందుకు ప్రయత్నించారు. లండన్‌లో ఆయనను కలిసేందుకు ఫ్యాన్ మీట్ పేరుతో కొందరు డబ్బులు వసూలు చేస్తున్నారని తెలిసింది.

ఈ విషయం చిరంజీవి దృష్టికి వెళ్లడంతో, ఆయన దీనిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు సోషల్ మీడియాలో ఓ పోస్ట్ చేస్తూ, అభిమానులకు కీలక సూచనలు చేశారు.
చిరంజీవి ట్వీట్:
“ప్రియమైన అభిమానులారా..! లండన్‌లో నన్ను కలిసేందుకు మీరు చూపిస్తున్న ప్రేమ, ఆదరణ నాకు ఎంతో సంతోషం కలిగించింది. అయితే, కొందరు ఫ్యాన్ మీట్ పేరుతో డబ్బులు వసూలు చేస్తున్నట్లు తెలిసింది. ఇది చాలా బాధాకరం. నేను ఇలాంటి అనుచిత చర్యలను అస్సలు సహించను.
ఫ్యాన్స్ మీటింగ్ పేరుతో ఎవరైనా డబ్బులు వసూలు చేస్తే, వెంటనే వారికి తిరిగి ఇచ్చేయండి. ఇలాంటి మోసపూరిత చర్యల విషయంలో అప్రమత్తంగా ఉండండి. నేను ఎప్పుడూ ఇలాంటి కార్యక్రమాలను ప్రోత్సహించను. మన అభిమాన సంబంధం అపారమైనది, దాన్ని స్వలాభార్జన కోసం ఉపయోగించకండి. మన ఆత్మీయ కలయికలను స్వచ్ఛంగా ఉంచుదాం.”
ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.