ప్రజా ప్రతినిధులంటే ప్రజల సేవకులు. వారు కూడా ఒక విధంగా ప్రభుత్వ ఉద్యోగులే. ప్రజలు కట్టే పన్నుల నుంచి ప్రతి నెలా జీతభత్యాలు తీసుకునే వారు. అలాంటి వారు తమకు ఓటు వేసిన ప్రజల కోసం అసెంబ్లీ సమావేశాలకు హాజరుకాకపోతే ఎలా? అనే ప్రశ్నను ముఖ్యమంత్రి చంద్రబాబు, స్పీకర్ అయ్యన్న పాత్రుడు అసెంబ్లీలో లేవనెత్తారు.

అసెంబ్లీలో వైసీపీ ఎమ్మెల్యేలు కొంత మంది హాజరైనట్లు రిజిస్టర్‌లో సంతకాలు చేసినా, వారెవరూ సభలో కనిపించలేదని చంద్రబాబు తెలిపారు. గవర్నర్ ప్రసంగం అనంతరం వైసీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు హాజరు కాకుండా కేవలం హాజరు రిజిస్టర్‌లో సంతకాలు చేయడంపై స్పీకర్ అయ్యన్నపాత్రుడు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రజలు ఎన్నుకున్న ప్రతినిధులు ధైర్యంగా సభకు రాలేరా? దొంగల్లా వచ్చి సంతకాలు చేయడం ఏంటని ఆయన ప్రశ్నించారు.
ఇటు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కూడా ఇదే అంశాన్ని ప్రస్తావించారు. అసెంబ్లీకి రాకుండా మాజీ సీఎం కేసీఆర్ 57 లక్షల జీతం తీసుకున్నారని విమర్శించారు. ప్రజల సొమ్మును జీతంగా తీసుకుంటూ, అసెంబ్లీ సమావేశాలకు హాజరు కాకుండా ఉండటం సమంజసమా? తెలంగాణ అభివృద్ధి కోసం హౌస్‌లో చర్చించకుండా ఉండిపోవడం తగినదా? అని రేవంత్ ప్రశ్నించారు.
అసెంబ్లీ హాజరు అంశంపై ఒకవైపు వైసీపీ ఎమ్మెల్యేలు, మరోవైపు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ టార్గెట్ అయ్యారు. దీనిపై భవిష్యత్తులో వీరి తీరు మారుతుందా? లేక ఈ విధంగానే కొనసాగుతుందా? అనేది చూడాలి.