ఏపీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత అమరావతి అభివృద్ధి గణనీయంగా వేగం పుంజుకుంది. రాష్ట్ర ప్రభుత్వం వీలైన అన్ని మార్గాల్లో నిధులను సమీకరించి, వేగంగా అభివృద్ధి పనులు చేపడుతోంది. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం, వివిధ బ్యాంకులు, సంస్థల నుంచి రుణాలు పొందుతున్న చంద్రబాబు సర్కారు, తాజాగా మరో కీలక ఒప్పందాన్ని కుదుర్చుకుంది.
హౌసింగ్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (హడ్కో) నుంచి అమరావతి అభివృద్ధికి 11 వేల కోట్ల రూపాయల రుణం మంజూరైంది. సీఎం చంద్రబాబు నివాసం ఉండవల్లిలో సీఆర్డీఏతో హడ్కో మధ్య ఈ ఒప్పందం కుదిరింది. దీంతో త్వరలోనే ఈ భారీ నిధులు అమరావతికి అందుబాటులోకి రానున్నాయి.

అమరావతి రాజధాని నిర్మాణానికి హడ్కో నుంచి రుణం పొందేందుకు ప్రభుత్వం ఇప్పటికే ప్రతిపాదనలు పంపింది. ఈ ఏడాది జనవరి 22న ముంబైలో జరిగిన హడ్కో బోర్డు సమావేశంలో ఈ రుణాన్ని మంజూరు చేయడానికి అంగీకారం లభించింది. తాజాగా ఈ నిధుల విడుదల కోసం సీఎం చంద్రబాబు సమక్షంలో అధికారిక ఒప్పందం జరిగింది.
అమరావతిని వేగంగా అభివృద్ధి చేసి, ఆర్థిక వృద్ధిని సాధించడంతో పాటు రుణాలను సకాలంలో తిరిగి చెల్లించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతోంది. ఇందులో భాగంగా, గతంలో పలు సంస్థలకు కేటాయించిన భూములపై ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది. అలాగే, 30 వేల కోట్ల రూపాయల విలువైన పనులకు టెండర్లు కూడా పూర్తయ్యాయి.
ఈ నిధులతో అమరావతిలో ప్రధాన మౌలిక వసతుల అభివృద్ధి, ప్రభుత్వ భవనాలు, రహదారులు, నీటి సరఫరా వంటి కీలక పనులను వేగంగా పూర్తి చేయనుంది ఏపీ ప్రభుత్వం.