జబర్దస్త్ ఫేమ్ ధన్‌రాజ్, బలగం వేణు తరహాలోనే, ఇటీవల దర్శకుడిగా పరిచయమయ్యాడు. ఆయన దర్శకత్వం వహించిన “రామం రాఘవం” అనే సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్రంలో ధన్‌రాజ్‌తో పాటు ప్రముఖ నటుడు, దర్శకుడు సముద్ర ఖని కీలక పాత్రలో నటించారు. సినిమా టైటిల్ నుంచి టీజర్, ట్రైలర్ వరకు మంచి స్పందన లభించింది.

ఫిబ్రవరి 21న విడుదలైన రామం రాఘవం, అంచనాలను అందుకుంటూ పాజిటివ్ రెస్పాన్స్ పొందింది. బలగం తరహాలో కాకపోయినా, కథ మరియు టేకింగ్ పరంగా విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ధన్‌రాజ్ దర్శకత్వానికి మంచి మార్కులు పడ్డాయి. కానీ, పెద్ద స్టార్ క్యాస్ట్ లేకపోవడంతో లాంగ్ రన్లో ఈ సినిమా మంచి కలెక్షన్లు రాబట్టలేకపోయింది. థియేటర్లలో ఓ మోస్తరుగా ఆడిన ఈ సినిమా, ఇప్పుడు ఓటీటీ వేదికగా రానుంది.
తెలుగు ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫార్మ్ ETV Win ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులు కొనుగోలు చేసింది. తాజాగా ETV Win అధికారికంగా రామం రాఘవం ఓటీటీ స్ట్రీమింగ్ అప్డేట్ ఇచ్చింది. ఖచ్చితమైన విడుదల తేదీ ప్రకటించనప్పటికీ, త్వరలోనే స్ట్రీమింగ్కు అందుబాటులోకి వస్తుందని తెలిపింది.
ఈ చిత్రాన్ని ప్రభాకర్ ఆరిపాక సమర్పణలో, స్లేట్ పెన్సిల్ స్టోరీస్ బ్యానర్‌పై పృథ్వి పోలవరపు నిర్మించారు. సినిమాలో సునీల్, మోక్ష సేన్‌గుప్తా, హరీష్ ఉత్తమన్, వెన్నెల కిషోర్, సత్య, పృథ్వీరాజ్, రఘుబాబు, శ్రీనివాస్ రెడ్డి, చిత్రం శ్రీను, రచ్చ రవి, ఇంటూరి వాసు, రాకెట్ రాఘవ కీలక పాత్రల్లో నటించారు. అరుణ్ చిలువేరు సంగీతం అందించగా, దుర్గా ప్రసాద్ కొల్లి సినిమాటోగ్రఫీ బాధ్యతలు నిర్వర్తించారు.

సినిమా కథ:
తండ్రి-కొడుకు అనుబంధాన్ని ప్రధానంగా తీసుకుని ఈ కథ మలిచారు. కన్న తండ్రినే కొడుకు హత్య చేయాలనుకునేలా దారి తీసిన పరిస్థితులేమిటి? అన్నదే కథాంశం. థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌తో పాటు భావోద్వేగాలను మేళవించి ఈ సినిమాను తీర్చిదిద్దారు.
త్వరలోనే రామం రాఘవం ఓటీటీలో విడుదల కాబోతుండటంతో, సినిమాను మిస్ అయిన ప్రేక్షకులు త్వరలోనే వీక్షించే అవకాశం పొందనున్నారు!