భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని తన ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) భవిష్యత్తుపై రహస్య సందేశంతో ఇంటర్నెట్‌లో సంచలనం సృష్టించాడు. చెన్నై సూపర్ కింగ్స్ (CSK) సహచరులతో కలవడానికి చెన్నై చేరుకున్న ధోని, తన టీ-షర్టుతో అభిమానుల్లో ఉత్కంఠ రేపాడు. ఆ టీ-షర్టుపై మోర్స్ కోడ్ వంటి సంకేతం ఉండటంతో, అది “చివరిసారి” అని అర్థమవుతుందనే ఊహాగానాలు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి.

అయితే, ధోని తన రిటైర్మెంట్‌పై ఏమీ స్పష్టంగా చెప్పకుండా, ఐపీఎల్ కోసం తన ఫిట్‌నెస్‌పై ఎంత కష్టపడుతున్నాడో వివరించాడు. “నేను సంవత్సరంలో రెండు నెలలే ఆడతాను, కానీ ప్రతి ఏడాది అదే ఉత్సాహంతో ఉండాలంటే 6 నుంచి 8 నెలల కఠిన శిక్షణ అవసరం. ఐపీఎల్ అత్యంత పోటీతో కూడిన లీగ్, అందుకే నేను శారీరకంగా, మానసికంగా సిద్ధంగా ఉండాలి,” అని వివరించాడు.
తన క్రికెట్ ప్రయాణాన్ని గుర్తుచేసుకుంటూ, భారతదేశానికి ప్రాతినిధ్యం వహించడం తన జీవితంలో అత్యంత గౌరవంగా భావించినట్లు ధోని చెప్పాడు. “నేను క్రికెట్‌కు పెద్దగా గుర్తింపు లేని రాష్ట్రం నుండి వచ్చాను. అయితే, ఒకసారి అవకాశం లభించినప్పుడు, నా శాయశక్తులా ప్రయత్నించాలని నిర్ణయించుకున్నాను. నా లక్ష్యం ప్రతి మ్యాచ్ గెలవడమే,” అని చెప్పాడు.
గత కొన్ని సంవత్సరాలుగా, ధోని తన రిటైర్మెంట్‌పై నేరుగా స్పందించకుండా, అభిమానులను ఉత్కంఠలో ఉంచడం అలవాటుగా మార్చుకున్నారు. 2023లో ఐపీఎల్ గెలిచిన తర్వాత, ధోని తన రిటైర్మెంట్ గురించి మాట్లాడుతూ, “ఇది నా చివరి మ్యాచ్ అయితే నా అభిమానులకి పెద్ద గిఫ్ట్ అవుతుంది. కానీ వాళ్ల ప్రేమ చూసిన తర్వాత, మరో ఏడాది ఆడటానికి నా శరీరం అనుమతిస్తే, అది వారికి నా కృతజ్ఞతగా భావించాను” అని చెప్పాడు.
ఇప్పుడు 2025 సీజన్‌ను చివరిదిగా సూచించే సంకేతాలు కనిపిస్తున్నాయి. మరి, ఈసారి అతను నిజంగా వీడ్కోలు పలుకుతాడా? లేదా ఇది అభిమానుల ఊహేనా? అనేది ఇంకా మిస్టరీగానే ఉంది.