వెస్ట్రన్ కాంగోలో ఓ అరుదైన, అత్యంత ప్రాణాంతకమైన వైరస్ వ్యాప్తి చెందుతోంది. ఈ మహమ్మారి ఇప్పటికే 50 మందికి పైగా ప్రాణాలు కోల్పోయేలా చేసింది. అత్యంత వేగంగా వ్యాపిస్తున్న ఈ వ్యాధికి కారణం గబ్బిలాలను తినడమేనని అనుమానిస్తున్నారు.

ఈ వైరస్‌తో బాధపడుతున్న వారికి జ్వరం, వాంతులు, అంతర్గత రక్తస్రావం వంటి లక్షణాలు కనిపిస్తున్నాయి. ఆ లక్షణాలు కనిపించిన 48 గంటల్లోపే మరణం సంభవిస్తోందని బికోరో హాస్పిటల్ డైరెక్టర్ సెర్జ్ న్గలేబాటో తెలిపారు.
ఆరంభం ఎలా జరిగింది?
ఈ వ్యాధి జనవరి 21న డెమొక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోలో ప్రారంభమైంది. బోలోకో గ్రామంలో ముగ్గురు పిల్లలు గబ్బిలం తిని 48 గంటల్లోపే మరణించారు. ఆ తర్వాత ఇది మరికొంత మందికి వ్యాపించి, ఇప్పటివరకు 419 కేసులు నమోదయ్యాయి, 53 మంది మరణించారు.

ఈ వైరస్ ఏమిటి?
ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకారం, ఈ వ్యాధి మొదట ఫిబ్రవరి 9న బోమాటే గ్రామంలో రెండవసారి వ్యాప్తి చెందింది. అక్కడి నుంచి 13 మంది రక్త నమూనాలను కిన్షాసాలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ బయోమెడికల్ రీసెర్చ్‌కి పంపారు. కానీ పరీక్షల్లో ఎబోలా, మార్బర్గ్, డెంగ్యూ, ఎల్లో ఫీవర్ వంటి హెమరేజిక్ జ్వరం వైరస్‌లు కాదని తేలింది. కొన్ని నమూనాలు మలేరియా పాజిటివ్గా తేలాయి.
తక్షణ చర్యలు అవసరం
ఈ మహమ్మారి కనుగొనబడని కొత్త వైరస్ కావొచ్చని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. దీనిని వెంటనే అరికట్టకపోతే మరింత మందికి వ్యాపించి, ప్రాణాలు తీసే అవకాశం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. WHO సహా ఇతర ఆరోగ్య సంస్థలు ఈ వ్యాధిని అరికట్టేందుకు తక్షణ చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉంది.