అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా తొలి రోజు గవర్నర్ నజీర్ ప్రసంగించారు. రాష్ట్ర అభివృద్ధి లక్ష్యంగా స్వర్ణాంధ్ర విజన్‌ను అమలు చేస్తూ కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతుందని ఆయన వెల్లడించారు. అయితే, ఈ సమావేశాలకు వైసీపీ అధినేత వైఎస్ జగన్ సహా ఆ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరయ్యారు. అయితే, తమకు ప్రతిపక్ష హోదా ఇవ్వడం లేదని ఆరోపిస్తూ గవర్నర్ ప్రసంగానికి అడ్డుగా నిలిచి, అనంతరం సభ నుంచి వాకౌట్ చేశారు.

వైసీపీ అధినేత జగన్ మాట్లాడుతూ, “వైసీపీ తప్ప అసెంబ్లీలో మరో పార్టీ ప్రతిపక్షంగా లేకపోవడంతో విపక్ష హోదా మా హక్కు” అని అన్నారు. ప్రభుత్వం హామీలను పూర్తిగా అమలు చేయలేదని విమర్శించారు. ప్రతిపక్ష హోదా లభిస్తే, సభలో ఎక్కువ సమయం కేటాయించాల్సి వస్తుందని, అందుకే తమకు ఆ హోదా ఇవ్వడం లేదని జగన్ ఆరోపించారు. “నాకు ఇంకా 30 ఏళ్లు రాజకీయ జీవితం ఉంది. అసెంబ్లీకి వెళ్లకపోయినా ప్రజా సమస్యలపై గళం వినిపిస్తాం” అని అన్నారు. 2028 ఫిబ్రవరిలో జరిగే జమిలి ఎన్నికల్లో కూటమిని ఓడించడమే లక్ష్యంగా పార్టీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు.
ప్రతిపక్ష హోదాపై వైసీపీ డిమాండ్
వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ, సభలో ప్రశ్నించాలంటే ప్రతిపక్ష హోదా అనివార్యమని తెలిపారు. గతంలో ఇతర రాష్ట్రాల్లో కేవలం మూడు సీట్లు గెలిచిన పార్టీలకైనా ఈ హోదా ఇచ్చారని పేర్కొన్నారు. ఏపీలో మాత్రం విపక్ష గొంతునొక్కాలని కూటమి ప్రభుత్వం ప్రయత్నిస్తోందని విమర్శించారు.
పవన్ కల్యాణ్ కౌంటర్
డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ వైసీపీ నేతల వ్యాఖ్యలకు కౌంటర్ ఇస్తూ, “ప్రతిపక్ష హోదా అడిగితే ఇచ్చేది కాదు, ప్రజలు ఇస్తేనే లభిస్తుంది” అని వ్యాఖ్యానించారు. జనసేన కన్నా ఒక్క సీటు ఎక్కువైనా గెలిచివుంటే వైసీపీకి ప్రతిపక్ష హోదా దక్కేదని అన్నారు. ఈ టర్మ్ ముగిసే వరకు వైసీపీకి ఈ హోదా రాదని స్పష్టం చేశారు. ప్రజలు ఇచ్చిన 11 సీట్లను గౌరవించి అసెంబ్లీకి రావాలని సూచించారు.
టీడీపీ నేతల విమర్శలు
వైసీపీ నాయకులపై టీడీపీ నేతలు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. మంత్రి అనగాని సత్యప్రసాద్ మాట్లాడుతూ, “శాసనసభ సభ్యత్వం రద్దవుతుందన్న భయంతోనే జగన్ అసెంబ్లీకి హాజరయ్యారు” అని అన్నారు. ప్రజలు గెలిపించిన 11 మంది ఎమ్మెల్యేలు 11 నిమిషాల పాటు కూడా సభలో లేకుండా వాకౌట్ చేయడం బాధ్యతారాహిత్యానికి నిదర్శనమన్నారు. ప్రజా సమస్యలపై నిజమైన చిత్తశుద్ధి ఉంటే అసెంబ్లీలో వచ్చి ప్రశ్నించాలని సూచించారు.
వైసీపీ నాయకులు ప్రతి అసెంబ్లీ సమావేశాన్ని బహిష్కరిస్తే, ప్రజలు వారికి గుణపాఠం చెబుతారని టీడీపీ నేతలు హెచ్చరించారు. 2028 జమిలి ఎన్నికల్లో వైసీపీకి ఇప్పుడు ఉన్న 11 సీట్లే కూడా రావని వ్యాఖ్యానించారు.