ఇంగ్లండ్‌లోని బ్లెన్హైమ్ ప్యాలెస్‌లో అద్భుతమైన కళాఖండంగా ప్రదర్శించబడిన 98 కేజీల బంగారు టాయిలెట్‌ను దొంగలు కేవలం 5 నిమిషాల్లో చాకచక్యంగా అపహరించారు. దాని విలువ సుమారు రూ.30 కోట్లు ఉంటుందని అంచనా. 2019 సెప్టెంబర్‌లో జరిగిన ఈ సంచలనాత్మక దొంగతనంలో ముఠా సభ్యులు భారీ సుత్తెలతో టాయిలెట్‌ను పగులగొట్టి అక్కడి నుంచి పారిపోయారు.

ఈ కేసు ఆక్స్ఫర్డ్ క్రౌన్ కోర్టులో విచారణకు రాగా, ముగ్గురు నిందితులుగా ఉన్న మైఖేల్ జోన్స్ (39), ఫ్రెడ్ డో (36), బోరా గుక్కుక్ (40) తమపై ఉన్న ఆరోపణలను ఖండించారు. మరో నిందితుడు జేమ్స్ షీన్ (39) మాత్రం తన ప్రమేయాన్ని అంగీకరించాడు. ఈ కేసుపై గత నాలుగు వారాలుగా విచారణ కొనసాగుతోంది.
ఈ బంగారు టాయిలెట్‌ను ఇటాలియన్ కళాకారుడు మౌరిజియో కాటెలాన్ ‘అమెరికా’ అనే పేరుతో రూపొందించారు. ఇది బ్లెన్హైమ్ ప్యాలెస్‌లో సందర్శకుల కోసం ప్రత్యేకంగా ప్రదర్శించబడింది. ప్రపంచ వారసత్వ ప్రదేశంగా యునెస్కో గుర్తింపు పొందిన ఈ ప్రదేశంలో జరిగిన ఈ చోరీ పెద్ద సంచలనాన్ని రేపింది. దొంగలు ప్యాలెస్‌కు రెండు వాహనాల్లో చేరుకుని, చెక్క గేట్లను ధ్వంసం చేసి లోపలికి చొరబడ్డారు. గోడ నుంచి టాయిలెట్‌ను పగులగొట్టి తక్కువ సమయంలో మాయం చేశారు. అయితే వారు ఉపయోగించిన సుత్తెలను అక్కడే వదిలిపెట్టారు.
ఈ బంగారు టాయిలెట్ బీమా విలువ 6 మిలియన్ డాలర్లు (సుమారు రూ.50 కోట్లు) అని కోర్టులో లాయర్లు తెలిపారు. దొంగలు దానిని చిన్న ముక్కలుగా చేసి విక్రయించి ఉండొచ్చని ప్రాసిక్యూటర్ జులియన్ క్రిస్టోఫర్ తెలిపారు.