ప్రమాదంలో ఇండియా సహా ఈ దేశాలు!
భూమి వైపు ఓ భారీ గ్రహశకలం దూసుకొస్తుందనే విషయాన్ని శాస్త్రవేత్తలు 2024 డిసెంబర్‌లో గుర్తించారు. ఈ గ్రహశకలానికి “2024 వైఆర్4” అనే పేరు పెట్టారు. 2032లో ఇది భూమిని ఢీ కొట్టే అవకాశం ఉందని నాసా శాస్త్రవేత్తలు ప్రకటించారు.

మొదట ఈ గ్రహశకలానికి భూమిని ఢీ కొట్టే అవకాశాన్ని 1.2% గా అంచనా వేశారు. కానీ కేవలం వారం రోజుల్లోనే ఇది 2.3% కి పెరిగింది. తాజా రిపోర్ట్ ప్రకారం ఇది 2.0% కి తగ్గింది. అయినప్పటికీ, శాస్త్రవేత్తలు దీనిని తేలికగా తీసుకోరు.
టొరినో స్కేల్‌లో వైఆర్4 స్థానం
గ్రహశకలాల ప్రమాదాన్ని అంచనా వేసే “టొరినో స్కేల్” లో ఇప్పటివరకు గుర్తించిన అన్ని గ్రహశకలాలకు 0 పాయింట్లు ఇచ్చారు. కానీ వైఆర్4 గ్రహశకలానికి మాత్రం 3 పాయింట్లు ఇచ్చారు. ఇది ఖగోళ శాస్త్రవేత్తలకు ఆందోళన కలిగించే విషయం.
500 అణుబాంబులకు సమానమైన ప్రభావం!
ఒక వేళ ఈ గ్రహశకలం భూమిని ఢీ కొడితే లేదా భూమి దగ్గరగా వచ్చినప్పుడు పేలిపోతే 500 అణుబాంబులు పేలినంత ప్రమాదం ఏర్పడుతుంది. హిరోషిమాపై జరిగిన అణుదాడి కంటే 500 రెట్లు ఎక్కువ ప్రభావం చూపే ప్రమాదం ఉంది.
భూమిపై ప్రభావం పడే దేశాలు
నాసా మరియు యూరోపియన్ స్పేస్ ఏజెన్సీలు ఈ గ్రహశకలాన్ని పరిశీలించడానికి ముమ్మరంగా కృషి చేస్తున్నాయి. శాస్త్రవేత్తల అంచనాల ప్రకారం “రిస్క్ కారిడార్” లో ఉన్న దేశాలు భయంకరమైన విధ్వంసాన్ని ఎదుర్కొనవచ్చు. ఈ ప్రమాదంలో ప్రధానంగా ప్రభావితమయ్యే దేశాలు:
- ఇండియా
- పాకిస్థాన్
- బంగ్లాదేశ్
- ఇథియోపియా
- సుడాన్
- నైజీరియా
- వెనిజులా
- కొలంబియా
- ఈక్వెడార్
వైఆర్4 గ్రహశకలం – భవిష్యత్తులో ఏమి జరుగనుంది?
ఈ గ్రహశకలం కక్ష్య మార్పుల కారణంగా కొన్ని సంవత్సరాలు కనిపించకుండా పోతుంది. 2028లో ఇది మళ్లీ భూమికి దగ్గరగా వస్తుందని అంచనా. అప్పటికి దీని వేగం, మార్పులు గురించి మరింత స్పష్టమైన సమాచారం లభించే అవకాశం ఉంది.
మార్చ్ 2025 నాటికి నాసా మరియు యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ దీనిపై మరింత లోతైన అధ్యయనం చేయబోతున్నాయి.
ఇప్పటికి 98% అవకాశముంది ఇది భూమిని ఢీ కొట్టకుండానే వెళ్ళిపోతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. కానీ మిగిలిన 2% ముప్పు కూడా గంభీరమే! ఈ ఘట్టాన్ని మానవజాతి ఎంతవరకు ఎదుర్కోగలుగుతుందో చూడాలి!