భారత్‌ను అస్థిరపరిచేందుకు బైడెన్ హయాంలో కుట్ర..! ధృవీకరించిన ట్రంప్
భారత్‌ను బలహీనపర్చే కుట్రలో అమెరికా కూడా పాకిస్తాన్ మార్గాన్ని అనుసరించినట్టు స్పష్టమైంది. భారత్, బంగ్లాదేశ్ సహా మరికొన్ని దేశాలను అస్థిరపరిచేందుకు అమెరికా భారీ మొత్తంలో నిధులను వెచ్చించినట్లు తెలుస్తోంది. ఈ సంచలన విషయాన్ని స్వయంగా అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ వెల్లడించారు. తన కంటే ముందు అధ్యక్షుడిగా పనిచేసిన జో బైడెన్ హయాంలో ఈ కుట్ర జరిగిందని ఆయన ధృవీకరించారు.

పాకిస్తాన్ ఉగ్రవాద కార్యకలాపాలు, నకిలీ కరెన్సీ ద్వారా భారత్‌ను దెబ్బతీసేందుకు ఎప్పటి నుంచో కుట్రలు పన్నుతోంది. అయితే ఇప్పుడు అమెరికా కూడా అదే మార్గాన్ని ఎంచుకుని, భారత్ సహా మరికొన్ని దేశాలను అస్థిరపరిచేందుకు ప్రయత్నించిందని ట్రంప్ ఆరోపించారు. ఈ కుట్రను అమలు చేయడానికి USAID నిధులను దుర్వినియోగం చేశారని ఆయన ఆరోపించారు.
అమెరికన్ బిలియనీర్ జార్జ్ సోరోస్‌కు USAID నుంచి 260 మిలియన్ డాలర్ల నిధులను అందించారని, ఈ నిధులను అల్లర్లు, అశాంతి సృష్టించేందుకు ఉపయోగించారని ట్రంప్ వెల్లడించారు. ఈ నిధులతో శ్రీలంక, బంగ్లాదేశ్, ఉక్రెయిన్, సిరియా, ఇరాన్, పాకిస్తాన్, ఇండియా, యూకే, అమెరికా వంటి దేశాల్లో ప్రభుత్వాలను మార్చడానికి ప్రయత్నించారని అన్నారు. ఈ విషయాన్ని ఆయన X (ట్విట్టర్) వేదికగా పంచుకున్నారు. ట్రంప్ అధికారంలోకి వచ్చిన వెంటనే USAID బడ్జెట్‌ను ఫ్రీజ్ చేసి, దానిపై దర్యాప్తు ప్రారంభించారు.
జార్జ్ సోరోస్ ఒక హంగేరియన్-అమెరికన్ బిలియనీర్. ప్రపంచవ్యాప్తంగా ఆయన వివిధ మీడియా సంస్థలకు, ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్టులకు నిధులు అందిస్తారు. వీటి ద్వారా తమ రాజకీయ ఎజెండాను అమలు చేయించేందుకు ప్రయత్నిస్తారు. వివిధ దేశాల్లో తమకు నచ్చని ప్రభుత్వాలను గద్దె దించడానికి ప్రభుత్వ వ్యతిరేక కథనాలను ప్రచురించేవారు.
భారత ఉపఖండంలో శ్రీలంక, బంగ్లాదేశ్‌లో జరిగిన ప్రజా ఆందోళనల వెనుక సోరోస్ హస్తం ఉందని ఆరోపణలు ఉన్నాయి. ఇక భారత్‌లో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, భారతీయ జనతా పార్టీ (బీజేపీ)పై నెగటివ్ ప్రచారం చేయడం, ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా కథనాలను ప్రచురించడం వంటి కార్యక్రమాలు కూడా దీంట్లో భాగమే.
USAID ద్వారా సోరోస్‌కు నిధుల వెల్లువ
గత 15 ఏళ్లలో USAID ద్వారా జార్జ్ సోరోస్‌కు 270 మిలియన్ డాలర్లు అందినట్టు తేలింది. ఈ నిధులను విదేశీ ప్రభుత్వాలను అస్తవ్యస్తం చేయడానికి మాత్రమే కాకుండా, అమెరికాలో రిపబ్లికన్ పార్టీకి వ్యతిరేకంగా ప్రచారం చేసేందుకు కూడా ఉపయోగించారని ట్రంప్ ఆరోపించారు.
తమ ఎజెండాకు నిధుల మళ్లింపు
బైడెన్ నేతృత్వంలోని డెమోక్రాటిక్ పార్టీ ప్రభుత్వం, సోరోస్‌కు పెద్ద మొత్తంలో నిధులను మంజూరు చేసిందని ట్రంప్ పేర్కొన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వాలను అస్థిరపరిచేందుకు USAID నిధులను దుర్వినియోగం చేసినట్టు ఆరోపణలు ఉన్నాయి.
ఈ ఆరోపణలు ఎంతవరకు నిజమో ఇంకా స్పష్టత రాలేదు. కానీ, ట్రంప్ చేసిన ఈ వ్యాఖ్యలు ప్రపంచ రాజకీయాల్లో పెనుచర్చకు దారితీశాయి.