హైదరాబాద్, ఫిబ్రవరి 6: తెలంగాణ రాష్ట్రంలో 2024-25 విద్యా సంవత్సరానికి సంబంధించిన పదో తరగతి పబ్లిక్ పరీక్షలు సమీపిస్తున్న నేపథ్యంలో విద్యాశాఖ కఠిన చర్యలు తీసుకుంటోంది. ఈ పరీక్షలు మార్చి 21 నుంచి ఏప్రిల్ 4 వరకు జరగనున్నాయి. గతంలో పేపర్ లీకేజీలు అధికారులకు తలనొప్పిగా మారిన నేపథ్యంలో, ఈసారి వీటిని పూర్తిగా అరికట్టేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు.

ఈసారి తొలిసారిగా టెన్త్ ప్రశ్నాపత్రాలపై సీక్రెట్ సెక్యూరిటీ కోడ్‌ను ముద్రించనున్నారు. ఈ కోడ్ ద్వారా ఎక్కడైనా పేపర్ లీక్ అయితే గంటల వ్యవధిలోనే నిందితులను గుర్తించడానికి వీలు పడుతుంది. పరీక్షల కోసం రూపొందించిన అన్ని ప్రశ్నాపత్రాల్లో ఈ కోడ్‌ను ముద్రించేందుకు పాఠశాల విద్యాశాఖ ఇప్పటికే కార్యాచరణ ప్రారంభించింది.
పేపర్ లీకేజీలపై కఠిన చర్యలు
పేపర్ లీకేజీలను నివారించేందుకు, ఈసారి ఎవరైనా లీకేజీకి పాల్పడినట్లు తేలితే, వారిపై కేవలం సస్పెన్షన్ మాత్రమే కాకుండా ఉద్యోగాల నుంచి శాశ్వతంగా తొలగించే చర్యలు తీసుకోనున్నట్లు విద్యాశాఖ స్పష్టం చేసింది. గతంలో కొందరు ఇన్విజిలేటర్లు పరీక్షా పత్రాలను లీక్ చేసి వాట్సాప్‌లో షేర్ చేయడం వంటి సంఘటనలు చోటుచేసుకున్న నేపథ్యంలో ఈసారి మరింత కఠినంగా వ్యవహరించనున్నారు.
ఈ సంవత్సరం టెన్త్ పరీక్షల్లో ముఖ్యమైన మార్పులు
- బుక్‌లెట్ విధానం:
- విద్యార్థులకు మొత్తం 24 పేజీల బుక్‌లెట్ అందజేస్తారు.
- గతంలోలా విడిగా పేపర్లు ఇవ్వకుండా, బుక్‌లెట్‌లోనే ఆన్సర్లు రాయాల్సి ఉంటుంది.
- గ్రేడింగ్ విధానం రద్దు:
- గతం వరకు ఉన్న గ్రేడింగ్ విధానాన్ని తొలగించి, కేవలం మార్కులను మాత్రమే ప్రదర్శిస్తారు.
- ఇంటర్నల్స్ మరియు థియరీ పరీక్షల మార్కులను కలిపి మొత్తం మార్కులు చూపిస్తారు.
- ఇంటర్నల్ మార్కుల విధానం
- ఈ సంవత్సరం మాత్రమే ఇంటర్నల్ మార్కులు ఉంటాయి.
- 2025-26 విద్యా సంవత్సరం నుంచి ఇంటర్నల్ మార్కుల విధానాన్ని పూర్తిగా రద్దు చేసి 100 మార్కులకు పరీక్ష నిర్వహిస్తారు.
- పరీక్షల వ్యవధి
- గతంలో ఆరు పేపర్లకుగాను ఏడు రోజులపాటు పరీక్షలు నిర్వహించేవారు.
- సైన్స్‌లో జీవశాస్త్రం, భౌతికశాస్త్రం పేపర్లకు రెండు రోజులు పరీక్షలు ఉండేవి.
- పదో తరగతి మెమోలపై పర్మినెంట్ ఎడ్యుకేషన్ నెంబర్ (PEN)
- ఆధార్ నంబర్‌లాగే PEN నెంబర్ విద్యార్థులకు యూనిక్ ఐడెంటిఫికేషన్ నెంబర్‌గా పనిచేస్తుంది.
ఈ మార్పులతో ఈ ఏడాది పదో తరగతి పరీక్షలు మరింత సురక్షితంగా, పారదర్శకంగా నిర్వహించాలని విద్యాశాఖ కృషి చేస్తోంది. 2024-25 విద్యా సంవత్సరానికి సంబంధించి దాదాపు 5.1 లక్షల మంది విద్యార్థులు పదో తరగతి పరీక్షలకు హాజరుకానున్నారు.












