ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్ రాజ్‌లో మహాకుంభమేళా అంగరంగ వైభవంగా జరుగుతోంది. ఈ మహా ఆధ్యాత్మిక ఉత్సవానికి దేశం నలుమూలల నుంచి భక్తులు తరలివస్తున్నారు. సామాన్య భక్తులతో పాటు సినీ, రాజకీయ, క్రీడా రంగాలకు చెందిన సెలబ్రిటీలు కూడా ఈ ఉత్సవంలో పాల్గొంటున్నారు. పవిత్ర త్రివేణి సంగమంలో పుణ్య స్నానం ఆచరిస్తూ పునీతులవుతున్నారు.

ఇదిలా ఉంటే, ఇటీవల సోషల్ మీడియాలో కుంభమేళాకు సంబంధించిన కొన్ని AI ఫొటోలు, ఫేక్ వీడియోలు విపరీతంగా వైరల్ అవుతున్నాయి. వీటిలో కొన్ని నెటిజన్లను ఆకర్షిస్తుండగా, కొన్ని వివాదాలకు దారి తీస్తున్నాయి.
అందులో ముఖ్యంగా ప్రముఖ నటుడు ప్రకాశ్ రాజ్ కుంభమేళాలో పవిత్ర స్నానం చేస్తున్నట్లు కొన్ని ఫొటోలు వైరల్ అయ్యాయి. నాస్తికుడిగా చెప్పుకునే ప్రకాశ్ రాజ్ పవిత్ర స్నానం చేస్తున్నట్లు చూడగానే నెటిజన్లు ఆశ్చర్యపోయారు. అయితే, ఈ ఫొటోలు ఫేక్ అని తెలిసిన తర్వాత ప్రకాశ్ రాజ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఫేక్ ఫొటోలపై కేసు పెట్టిన ప్రకాష్ రాజ్
ఈ వ్యవహారంపై ప్రకాశ్ రాజ్ పోలీసులను ఆశ్రయించారు. ప్రముఖ సామాజికవేత్త, బిగ్ బాస్ మాజీ కంటెస్టెంట్ ప్రశాంత్ సంబర్గిపై కేసు పెట్టారు. మైసూరు లక్ష్మీపురం పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసిన ఆయన, “ఏఐ టెక్నాలజీని ఉపయోగించి దుష్ప్రచారం చేస్తున్నారు. ఇది అరికట్టాలి” అని పోలీసులను కోరారు.
ఈ సందర్భంగా ప్రకాష్ రాజ్ మాట్లాడుతూ, “మహా కుంభమేళాలో పవిత్ర స్నానం చేయడంలో తప్పేమీ లేదు. కానీ అది నా నమ్మకం కాదు. నాకు దేవుడిపై నమ్మకం లేదు. నేను మనుషులను నమ్ముతాను. మనం దేవుడు లేకుండా బ్రతకగలం, కానీ మానవత్వం లేకుండా కాదు” అని స్పష్టం చేశారు.
సినిమాలతో బిజీగా ఉన్న ప్రకాష్ రాజ్
ప్రస్తుతం ప్రకాశ్ రాజ్ విలన్, హీరో, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా నటిస్తూ బిజీగా ఉన్నారు. ఆయన చేతిలో డజన్ల కొద్దీ సినిమాలు ఉన్నాయి. సినీ రంగంతో పాటు రాజకీయపరమైన వ్యాఖ్యలతో కూడా తరచూ వార్తల్లో ఉంటూ, బీజేపీ నిర్ణయాలను తీవ్రంగా విమర్శిస్తూ వస్తున్నారు.
ఈ ఫేక్ ఫొటోల ఘటనతో సోషల్ మీడియాలో దుష్ప్రచారంపై కొత్త చర్చ మొదలైంది. AI టెక్నాలజీని వాడి ఇలా ఎవరికైనా ఇష్టమొచ్చినట్లుగా ఫొటోలు మార్ఫ్ చేయడం ఎంతవరకు సమంజసం? అన్నదానిపై నెటిజన్లు చర్చిస్తున్నారు.
మొత్తం గా చూస్తే, ప్రకాశ్ రాజ్ ఫేక్ ఫొటో వైరల్ కావడం, ఆయన పోలీసు కేసు పెట్టడం, బిగ్ బాస్ కంటెస్టెంట్ ప్రశాంత్ సంబర్గిపై ఆరోపణలు అన్నీ కలిపి పెద్ద వివాదంగా మారాయి. AI టెక్నాలజీ వినియోగంపై కట్టడి అవసరమా? అనే చర్చకు ఇది నాంది పలికేలా ఉంది.
