ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో బాగ్‌పత్‌లో ఆదినాథుడి ఆలయంలో జరిగిన లడ్డూ మహోత్సవం సందర్భంగా ప్రమాదం జరిగింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన 65 అడుగుల ఎత్తైన వేదిక ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. దీంతో పెద్ద ఎత్తున తొక్కిసలాట చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో 7 మంది భక్తులు ప్రాణాలు కోల్పోయారు, మరికొంతమంది తీవ్రంగా గాయపడ్డారు.

ఈ సంఘటన జనవరి 28, 2025 ఉదయం బాగ్‌పత్ జిల్లా, కొత్వాలి ప్రాంతంలోని గాంధీ రోడ్డులో జరిగింది. ఆదినాథ్ ఆలయంలో జరుగుతున్న లడ్డూ మహోత్సవం సందర్భంగా, చెక్కతో నిర్మించిన వేదికపై విగ్రహం ఉంచారు. భక్తులు గుడిని దర్శించుకోవడానికి మెట్లు ఎక్కుతుండగా, అధిక బరువు కారణంగా మెట్లు విరిగి వేదిక కుప్పకూలిపోయింది.
వేదిక కూలిన వెంటనే 50 మంది పైగా భక్తులు దానిలో చిక్కుకున్నారని, అందులో 7 మంది మరణించారని, 40 మందికి పైగా గాయపడారని అధికారులు తెలిపారు. గాయపడిన వారిని వెంటనే ఆస్పత్రికి తరలించారు. 5 మంది పోలీసులు కూడా ఈ ఘటనలో గాయపడ్డారు.
సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సంఘటన స్థలాన్ని సందర్శించి, అధికారులను సహాయక చర్యలను వేగవంతం చేయాలని ఆదేశించారు.