ప్రముఖ నిర్మాత, టీఎఫ్డీసీ (TFDC) చైర్మన్ దిల్ రాజు ఐటీ దాడులపై స్పందించారు. వ్యాపారాల్లో ఇలాంటి దాడులు సాధారణమని చెప్పారు. తనపై ప్రత్యేకంగా మీడియా ఫోకస్ ఎందుకంటే తాను సెలబ్రిటీ కావడమే కారణమన్నారు. ఈ దాడులు ఇండస్ట్రీ మొత్తానికీ సంబంధించి జరిగాయన్నారు, తాము మాత్రమే టార్గెట్ కాదని స్పష్టం చేశారు.
ఇటీవలి ఐటీ సోదాలపై వివరణ:
గత నాలుగు రోజులు తన నివాసం, కార్యాలయాల్లో జరిగిన ఐటీ సోదాల గురించి దిల్ రాజు మాట్లాడుతూ, “ఐటీ సోదాల్లో కొన్ని ఛానెల్స్, సోషల్ మీడియాలో తప్పుడు వార్తలు వచ్చాయి. మా వద్ద రూ.5 లక్షలు మాత్రమే ఉన్నాయి, శిరీష్ వద్ద రూ.4.5 లక్షలు ఉన్నాయన్నారు. ఐదు సంవత్సరాలుగా మేము ఎక్కడా ఇన్వెస్ట్ చేయలేదు. 24 క్రాప్ట్స్లో లావాదేవీల వివరాలు అడిగారు, అందుకు సంబంధించిన వివరాలు అందించాం. మా పారదర్శకత చూసి ఐటీ అధికారులు ఆశ్చర్యపోయారు.” అని చెప్పారు.

అసత్య వార్తలపై స్పందన:
దిల్ రాజు తల్లి గుండెపోటు కారణంగా ఆస్పత్రిలో అడ్మిట్ అయ్యారన్న వార్తలపై స్పందిస్తూ, “మా అమ్మకి లంగ్ ఇన్ఫెక్షన్ కారణంగా చికిత్స జరిగింది. అసత్య ప్రసారాలను ఆపాలని కోరుతున్నాను.” అని తెలిపారు.
మునుపటి అనుభవాలు:
2008లో ఒకసారి ఐటీ శాఖ తనపై దాడులు జరిపిందని, దాదాపు 16 ఏళ్ల తర్వాత ఈ సోదాలు జరుగుతున్నాయన్నారు. మధ్యలో మూడు సార్లు సర్వేలు నిర్వహించి అకౌంట్ బుక్స్ చెక్ చేశారని వివరించారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఇండస్ట్రీలో ఆన్లైన్ బుకింగ్లు, ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ కొనసాగుతున్నాయని, బ్లాక్ మనీ సమస్యలు లేవని స్పష్టం చేశారు.