పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులకు మరొక సర్‌ప్రైజ్ అందించారు. హరి హర వీరమల్లు సినిమా నుంచి ఫస్ట్ సింగిల్‌గా “మాట వినాలి” అనే పాటను విడుదల చేసింది చిత్రయూనిట్. ఈ పాటను స్వయంగా పవన్ ఆలపించడం విశేషం. తన అభిమానులకు ప్రత్యేకమైన అనుభూతిని అందించాలనే ఉద్దేశంతో, జానపద బాణీకి పవన్ తన గాత్రాన్ని మరోసారి అందించారు.

ఎంఎం కీరవాణి స్వరపరిచిన ఈ పాటకు పెంచల్ దాస్ అద్భుతమైన సాహిత్యాన్ని అందించారు. తెలుగు మాత్రమే కాకుండా, ఇతర భాషల్లో కూడా పవన్ వాయిస్‌ను ఎంజాయ్ చేస్తున్నారు ప్రేక్షకులు. ఏఐ సాంకేతికతను ఉపయోగించి పవన్ గొంతును మరింత సొగసుగా తీర్చిదిద్దారు.
ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ స్టేజ్‌లో ఉన్న హరి హర వీరమల్లు సినిమా మార్చి 28న విడుదల కానుంది. చిత్రయూనిట్ ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ వాయిదా లేకుండా సినిమాను రిలీజ్ చేయాలని కట్టుదిట్టమైన నిర్ణయం తీసుకుంది. దర్శకుడు క్రిష్ అందుబాటులో లేకపోవడంతో, జ్యోతికృష్ణ సినిమా పూర్తి చేసే బాధ్యతను స్వీకరించారు.
ఈ చిత్రం పవన్ తొలి పీరియాడిక్ మూవీ కావడంతో, భారీ అంచనాలు నెలకొన్నాయి. మెగా సూర్య ప్రొడక్షన్స్ పాన్ ఇండియా రేంజ్‌లో భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను నిర్మిస్తోంది.