తెలంగాణ మంత్రి సీతక్క హీరో అల్లు అర్జున్ నటించిన ‘పుష్ప’ సినిమాకు జాతీయ అవార్డు లభించడంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. తాజాగా ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ, “ఎర్రచందనం దొంగలకు జాతీయ అవార్డు ఇవ్వడం ఏమిటి?” అని ప్రశ్నించారు. “జై భీమ్” లాంటి సందేశాత్మక చిత్రాలకు అవార్డులు రాలేదని, కానీ పోలీసులను అవమానించే సినిమాలకు అవార్డులు ఇస్తున్నారని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. “మానవ హక్కులను కాపాడే లాయర్‌ను జీరోగా చూపిస్తూ, స్మగ్లర్‌ను హీరోగా చిత్రీకరించడం సరికాదు” అని మండిపడ్డారు.
“సినిమాలో స్మగ్లర్ హీరో అయితే, స్మగ్లింగ్‌ను అరికట్టే పోలీసు విలన్ ఎలా అవుతాడు?” అని ప్రశ్నిస్తూ, ఇలాంటి సినిమాలు నేర ప్రవృత్తులను ప్రోత్సహిస్తాయని ఆందోళన వ్యక్తం చేశారు. సినిమాలు ఎంటర్‌టైన్‌మెంట్ అయినా, ప్రజలకు మంచి సందేశాలు ఇవ్వాలి. సినిమా నటులు, నిర్మాతలు, దర్శకులు సమాజాన్ని ఉన్నత స్థాయికి తీసుకెళ్లే ఆలోచనలతో సినిమాలు తీయాలి అని సీతక్క అన్నారు.