బోర్డర్-గవాస్కర్ టెస్ట్ సిరీస్ మధ్యలో టీమిండియా స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ రిటైర్మెంట్ ప్రకటనతో క్రికెట్ ప్రపంచం షాక్‌కు గురైంది. ఈ సిరీస్ ముగిసేలోగా మరో సీనియర్ ఆటగాడు రిటైర్మెంట్ ప్రకటించే అవకాశం ఉందని సమాచారం.
ఆస్ట్రేలియాతో టెస్ట్ సిరీస్ ప్రారంభానికి ముందు కొన్ని కీలకమైన పరిణామాలు చోటు చేసుకున్నాయి. బీసీసీఐ, న్యూజిలాండ్‌తో టెస్ట్ సిరీస్‌లో టీమిండియా ఘోర పరాజయం తర్వాత, సీనియర్ ఆటగాళ్ల ప్రదర్శనపై ప్రత్యేక దృష్టి పెట్టింది. దీంతో, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, రవీంద్ర జడేజా వంటి ఆటగాళ్ల భవిష్యత్తు ఇప్పుడు చర్చనీయాంశమైంది.
37 ఏళ్ల రోహిత్ శర్మ, వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ తర్వాత టెస్టు క్రికెట్‌కు వీడ్కోలు పలికే అవకాశం ఉందని అనేక ఊహాగానాలు వస్తున్నాయి. ఇదే సమయంలో, జట్టులో మిగిలిన సీనియర్లు తమ స్థానం నిలుపుకుంటారా లేదా అనేది కూడా ఆసక్తికరంగా మారింది.
ఆస్ట్రేలియాతో 5 మ్యాచ్‌ల సిరీస్ టీమిండియా సీనియర్ ఆటగాళ్లకు చాలా కీలకమైందిగా మారింది. ఇంతలో రవిచంద్రన్ అశ్విన్ అనూహ్య రీతిలో రిటైర్మెంట్ ప్రకటించడంతో మిగతా సీనియర్ ఆటగాళ్లు ఏ నిర్ణయం తీసుకుంటారో అన్న చర్చలు జోరందుకున్నాయి.