హైదరాబాద్: నగరంలోని అక్రమ నిర్మాణాల కూల్చివేతలపై హైడ్రా కమిషనర్ రంగనాథ్ తాజాగా కీలక ప్రకటన చేశారు. గతంలో అనుమతులిచ్చినా, ఆ తర్వాత రద్దు చేస్తే అవి అక్రమమే అవుతాయని, అందుకే అనుమతులు రద్దైన నిర్మాణాలను అక్రమ కట్టడాలుగా పరిగణించి కూల్చివేస్తామన్నారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ… హైడ్రా రాకముందు అనుమతిచ్చిన ఏ కట్టడాలను కూడా కూల్చబోమని తెలిపారు.
అనుమతి లేకుండా నిర్మించిన నివాస గృహాలు జులై 2024నాటికల్లా సిద్ధమై, వాటిలో ఎవరైనా నివాసముంటే హైడ్రా వాటిని కూల్చివేయబోదన్నారు. ఎఫ్‌టీఎల్‌లో అనుమతులు లేకుండా నిర్మించిన వాణిజ్య, వ్యాపార కట్టడాలను కూల్చక తప్పదన్నారు. కొందరు పెద్దలు పేదలను ముందు పెట్టి తాము వెనుక నుంచి చక్రం తిప్పుతున్నారని ఆరోపించారు. అలాంటి ల్యాండ్ గ్రాబర్స్ చర్యలను హైడ్రా తీవ్రంగా పరిగణిస్తుందని రంగనాథ్ హెచ్చరించారు.
మల్లంపేట కొత్వాల్ చెరువు, అమీన్‌పూర్‌లలో కూల్చివేసిన నిర్మాణాలు అక్రమ కట్టడాలేనని ఆయన వివరించారు. ఎఫ్‌టీఎల్ మార్కింగ్ ప్రక్రియను పారదర్శకంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కాలనీ సంక్షేమ సంఘాలు, ప్రజలు ఇచ్చే ఫిర్యాదులకు హైడ్రా ఎంతో ప్రాధాన్యతను ఇస్తుందన్నారు. 12 చెరువుల్లో కూల్చివేతలు చేపట్టామని, చెరువుల పునరుద్ధరణకు సంబంధించిన వివరాలను ప్రభుత్వానికి నివేదించినట్లు తెలిపారు. హైడ్రా అనేక అంశాలపై స్పష్టమైన వైఖరితో ముందుకు వెళుతున్నదన రంగనాథ్ పేర్కొన్నారు.
హైడ్రాలో లోటుపాట్లు ఉంటే సరిదిద్దుకొని ముందుకు సాగుతునున్నామన్నారు. వివిధ సందర్భాలలో కోర్టు తీర్పులకు అనుగుణంగా హైడ్రా ముందుకు వెళుతుందన్నారు. ప్రభుత్వం అందించిన దిశానిర్దేశనం మేరకు హైడ్రా పని చేస్తున్నదన్నారు. హైడ్రాను బలోపేతం చేసేందుకుప్రభుత్వం పలు అధికారులను కట్టబెట్టిందన్నారు. గడచిన ఐదు నెలల్లో హైడ్రా 200 ఎకరాల ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకుందని రంగనాథ్ తెలిపారు.