భారతీయ చలనచిత్ర పరిశ్రమలో గొప్ప నటునిగా పేరు గాంచిన రాజ్ కపూర్ జన్మదినం నేడు( డిసెంబర్ 14). షోమ్యాన్ అనే ట్యాగ్‌కు అతీతంగా రాజ్ కపూర్ తన నటనలో ఎంతో ప్రత్యేకత చూపేవారు. ఆ మహానటుని 100వ జయంతి నేడు. రాజ్ కపూర్‌కు భారతదేశంలోనే కాకుండా విదేశాలలో కూడా లెక్కలేనంతమంది అభిమానులున్నారు. తన వ్యక్తిగత జీవితం కారణంగా ఆయన పలుమార్తు వార్తల్లో నిలిచారు. రాజ్ కపూర్ జీవితంలోని అతి కొద్ది మందికి మాత్రమే తెలిసిన కొన్ని విశేషాలను ఇప్పుడు తెలుసుకుందాం.
రాజ్ కపూర్ 1924 డిసెంబర్ 14న బ్రిటీష్ ఇండియాలోని పెషావర్‌లో జన్మించారు. అది ఇప్పుడు పాకిస్తాన్‌లో ఉంది. రాజ్ కపూర్ తండ్రి పేరు పృథ్వీరాజ్ కపూర్. ఇతను కూడా ప్రముఖ నటుడు. తన తండ్రిలాగే రాజ్ కపూర్ కూడా అద్భుతమైన నటునిగా ఎదిగారు. 10 సంవత్సరాల వయస్సులోనే రాజ్ కపూర్ నటనారంగంలోకి ప్రవేశించారు. చైల్డ్ ఆర్టిస్ట్‌గా తన తండ్రి పృథ్వీరాజ్ కపూర్ చిత్రం ఇంక్విలాబ్‌లో నటించారు.
రాజ్ కపూర్.. కృష్ణ కపూర్‌ను వివాహం చేసుకున్నారు. వారిద్దరికీ పిల్లలు ఉన్నారు. అయితే అతని మనసంతా సహనటి నర్గీస్‌పైనే ఉండేది. రాజ్ కపూర్ ఆమె అందానికి ఎంతగానో ముగ్ధుడై తన కుటుంబాన్ని కూడా మరచిపోయాడు. అయితే ఆ తర్వాత కుటుంబ కలహాలు పెరగడంతో రాజ్ కపూర్.. నర్గీస్‌ని మరచిపోలేక మద్యానికి బానిసయ్యాడు. రాజ్‌కపూర్ ఎప్పుడూ బాత్ టబ్‌లో కూర్చుని, మద్యం సేవించేవాడని, సిగరెట్ తాగేవాడని అతని భార్య ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. రాజ్ కపూర్ సినిమా పార్టీలకు తప్పనిసరిగా హాజరయ్యేవారు. 1988 జూన్ 2న రాజ్ కపూర్ కన్నుమూశారు. రాజ్‌కపూర్ జన్మదినోత్సవం సందర్భంగా ఆయనకు వేదిక నివాళులు అర్పిస్తోంది.