తెలంగాణ: ఇందిరమ్మ ఇళ్లపై బిగ్ అప్‌డేట్.. మంత్రి కీలక ఆదేశాలు
ఇందిరమ్మ ఇండ్ల విషయంలో తెలంగాణ ప్రభుత్వం వేగంగా చర్యలు తీసుకుంటోంది. ఈ క్రమంలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి, కీలక ఆదేశాలు జారీ చేశారు. దరఖాస్తుల పరిశీలనకు డెడ్‌లైన్‌ను ఈ నెల 31 వ తేదీగా నిర్ణయించారు. ఆయన చెప్పినట్లుగా, పొరపాట్లు జరగకుండా సర్వేను సమగ్రమైన విధంగా నిర్వహించాలన్నారు.
ఇందిరమ్మ ఇండ్ల కోసం ప్రజా పాలనలో వచ్చిన 80 లక్షల దరఖాస్తుల పరిశీలనను త్వరగా పూర్తి చేయాలని మంత్రి ఆదేశించారు. సర్వే వివరాలను ఎప్పటికప్పుడు మొబైల్ యాప్‌లో నమోదు చేయాలని సూచించారు. అలాగే, ప్రతి 500 మందికి ఒక సర్వేయర్‌ను నియమించుకోవాలని, సర్వేలో ఇందిరమ్మ కమిటీ సభ్యులను కూడా భాగస్వామ్యం చేయాలని మంత్రి చెప్పారు.
ఈ సర్వే పనిలో లోపాలు రాకుండా, ప్రతి గ్రామంలో సర్వే నిర్వహించాలంటే ముందుగా ప్రజలకు సమాచారం ఇవ్వాలని, సర్వే తేదీకి ముందు రోజు రాత్రి ప్రకటన చేయాలని పేర్కొన్నారు. స్థానిక పరిస్థితులకు అనుగుణంగా కలెక్టర్లు ప్రణాళికలు రూపొందించాల్సి ఉందని చెప్పారు. మొత్తం ప్రక్రియను పారదర్శకంగా, పకడ్బందీగా నిర్వహించాలని, ప్రతి రోజు కలెక్టర్లు సమీక్షించాల్సి ఉందని సూచించారు.
మరిన్ని ఫిర్యాదులు, సలహాల కోసం ప్రతి జిల్లా కేంద్రంలో టోల్ ఫ్రీ నంబర్ ఏర్పాటు చేయాలని మంత్రి ఆదేశించారు. దీనితో పాటు, ఈ ఏడాది 4.5 లక్షల ఇండ్ల నిర్మాణం ప్రక్రియను సజావుగా కొనసాగించాలని కలెక్టర్లకు సూచించారు.