కడప: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో టీచర్లను తల్లిదండ్రులను సమావేశపరచచి, స్థానిక ప్రజా ప్రతినిధుల సమక్షంలో మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ నిర్వహిస్తోంది. అన్ని జిల్లాలలోనూ చేపట్టిన పీటీఎంలో భాగంగా సీఎం చంద్రబాబు బాపట్లలో పాల్గొనగా, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కడపలో పాల్గొన్నారు. కడపలోని మున్సిపల్ కార్పొరేషన్ హై స్కూల్‌లో ఈ మెగా పేరెంట్స్ టీచర్స్ మీట్ జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న పవన్ కళ్యాణ్ కు కడపలో ఘన స్వాగతం లభించింది. అనంతరం పవన్ కళ్యాణ్ రోడ్డు హై స్కూల్ కి వెళ్లి, అక్కడ పోలీసుల నుంచి గౌరవ వందనాన్ని స్వీకరించారు. తరువాత స్కూల్ ఆవరణలో ఉన్న అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. పేరెంట్స్ టీచర్స్ మీట్‌లో పాల్గొన్న పవన్ కళ్యాణ్ విద్యార్థులతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. తల్లిదండ్రులతో మాట్లాడి వారి అభిప్రాయాలను సేకరించారు.
ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ ఒకప్పుడు రాయలసీమలో అత్యధికంగా లైబ్రరీలు ఉండేవన్నారు. ఎంతోమంది మహానుభావులు రాయలసీమ నుంచి వచ్చిన వారేనని, అటువంటి రాయలసీమకు పునర్వైభవం తీసుకురావాలని అని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. గతంలో తాను ఉద్దానం సమస్యను అందరికీ తెలియజేశానని, ఆనాటి సీఎం చంద్రబాబు 61 కోట్లతో ఉద్దానం ప్రాజెక్టును ముందుకు తీసుకువెళ్లారని ఆయన పేర్కొన్నారు. కడప ప్రాంతం నుంచి ఇద్దరు సీఎంలు అయిన కారణంగా ఈ ప్రాంతంలో ప్రజలకు ఎలాంటి సమస్యలు ఉండవని అనుకున్నానని అన్నారు. పులివెందుల తాగునీటి ప్రాజెక్టు కోసం 45 కోట్ల రూపాయలు ఇచ్చామని తెలిపారు. ప్రజల నీటి సమస్యను తీరుస్తామని పవన్ కళ్యాణ్ హామీనిచ్చారు.