అమెరికా 47వ అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ఇవాళ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమం అత్యంత ప్రత్యేకంగా నిర్వహించబడుతోంది. వాషింగ్టన్ డీసీ నగరాన్ని శత్రుదుర్భేద్యంగా మార్చి, కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేయడం జరిగింది. క్యాపిటల్ హిల్‌లోని రోటుండా ఇండోర్ ఆవరణలో, సోమవారం మధ్యాహ్నం (భారత కాలమానం ప్రకారం రాత్రి 10:30 గంటలకు) ట్రంప్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు.
ఈ మహోత్సవానికి ప్రపంచ దేశాల ప్రముఖులు, వ్యాపార దిగ్గజాలు హాజరవుతున్నారు. ట్రంప్ తన అధ్యక్ష పగ్గాలు చేపట్టిన మొదటి రోజే తనదైన ముద్ర వేయాలని చూస్తున్నారు. సుమారు 100 కార్యనిర్వాహక ఉత్తర్వులపై సంతకాలు చేసేందుకు సిద్ధమవుతున్నారు. పలు దేశాలపై అదనపు పన్నుల విధింపు వంటి కీలక నిర్ణయాలు ఆయన తీసుకోనున్నారనే ఉత్కంఠ నెలకొంది.

విక్టరీ ర్యాలీలో ట్రంప్ సంచలన వ్యాఖ్యలు:
ప్రమాణ స్వీకారానికి ముందు వాషింగ్టన్ డీసీలో నిర్వహించిన విక్టరీ ర్యాలీలో ట్రంప్ మాట్లాడుతూ, తన పాలన ధమాకాతో స్టార్ట్ అవుతుందని చెప్పారు. “తొలిరోజే సుమారు 200 ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ల మీద సంతకం చేస్తాను,” అంటూ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి.