సూపర్ స్టార్ రజినీకాంత్ భారత యువ గ్రాండ్ మాస్టర్, ప్రపంచ చెస్ ఛాంపియన్ డి గుకేశ్‌ను ప్రత్యేకంగా తన ఇంటికి ఆహ్వానించి సన్మానించారు. గుకేశ్ తన తల్లిదండ్రులతో కలిసి రజినీ ఇంటికి వెళ్లి ఆయన ఆశీస్సులు పొందారు. ఈ సందర్భంగా తలైవా గుకేశ్‌ను శాలువాతో సత్కరించి, పరమహంస యోగానంద రచించిన ఆధ్యాత్మిక పుస్తకం **‘ఆటోబయోగ్రఫీ ఆఫ్ ఎ యోగి’** ను బహుమతిగా అందించారు.
గుకేశ్ ఇటీవల సింగపూర్‌లో జరిగిన ఫిడే వరల్డ్ ఛాంపియన్‌షిప్‌లో విజేతగా నిలిచి చరిత్ర సృష్టించాడు. 14వ గేమ్‌లో చైనాకు చెందిన డింగ్ లిరెన్‌ను ఓడించి ప్రపంచ ఛాంపియన్‌గా అవతరించిన అతడు, విశ్వనాథన్ ఆనంద్ తర్వాత ఈ టైటిల్ గెలుచుకున్న రెండవ భారతీయుడు కావడం విశేషం.
రజినీకాంత్‌తో పాటు గుకేశ్ హీరో శివకార్తికేయన్‌ను కూడా కలుసుకున్నారు. శివకార్తికేయన్ గుకేశ్‌కు విలువైన చేతి గడియారాన్ని బహుమతిగా అందించారు. ఈ అనుభవాలను గుకేశ్ తన ట్విట్టర్ ఖాతాలో పంచుకున్నారు.