Vedika Media

Vedika Media

vedika logo

మోహన్ బాబు: అజ్ఞాతంలో మోహన్ బాబు.. పారిపోలేదంటూ ట్వీట్..

రిపోర్టర్ రంజిత్‌పై దాడి జరిగిన నేపథ్యంలో, తెలుగు రాష్ట్రాల్లో జర్నలిస్టు సంఘాలు నిరసన వ్యక్తం చేస్తున్నాయి. నాలుగు రోజులుగా ధర్నాలు, ర్యాలీలు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయిన మోహన్ బాబు, వాంగ్మూలం రికార్డు చేయడానికి ప్రయత్నించిన పోలీసులు మోహన్ బాబును కనిపెట్టలేకపోయారు.

మొన్నటివరకు, తెలుగు సినిమా ఇండస్ట్రీలో మంచు కుటుంబం వివాదం చర్చనీయాంశంగా మారింది. ఈ వివాదాన్ని కవరేజీ చేయడానికి వెళ్లిన మీడియాపై మోహన్ బాబు దాడి చేశాడు. రిపోర్టర్ రంజిత్ పై దాడి చేయడంతో అతడు తీవ్రంగా గాయపడ్డాడు. దీంతో మోహన్ బాబుపై పోలీసులు హత్యాయత్నం కేసు నమోదు చేశారు. దాడి అనంతరం రెండు రోజుల పాటు ఆసుపత్రిలో ఉన్న మోహన్ బాబు, ఆ తర్వాత డిశ్చార్జ్ అయి ఇంటికి చేరుకున్నారు. తరువాత ఆయన అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. మీడియాపై దాడి కేసులో మోహన్ బాబు దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్‌ను కోర్టు కొట్టేసింది. ఈ నేపథ్యంలో, మోహన్ బాబు వాంగ్మూలం రికార్డ్ చేయడానికి వెళ్లిన పోలీసులకు ఆయన కనిపించకపోవడంతో, మోహన్ బాబు కోసం ప్రత్యేక బృందాలతో పోలీసులు గాలిస్తున్నారని సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది.

ఇటీవల, తన గురించి వస్తున్న వార్తలపై మోహన్ బాబు సోషల్ మీడియాలో స్పందించారు. “నేను ఎక్కడికీ వెళ్లిపోలేదు. నాపై తప్పుడు ప్రచారం జరుగుతోంది. ముందస్తు బెయిల్ తిరస్కరించలేదు. ప్రస్తుతం ఇంట్లోనే చికిత్స తీసుకుంటున్నాను. నా గురించి అసత్యపు వార్తలు రాయకండి” అని ట్వీట్ చేశాడు.

ఇక, మోహన్ బాబు తీరును ప్రజాప్రతినిధులు తీవ్రంగా ఖండిస్తున్నారు. సహనం కోల్పోయి మీడియా ప్రతినిధులపై దాడి చేయడం సరికాదంటున్నారు. రిపోర్టర్ రంజిత్‌పై మోహన్ బాబు చేసిన దాడిని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తీవ్రంగా ఖండించారు. ఈ వ్యవహారంలో ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని స్పష్టం చేశారు. మరోవైపు, తెలుగు రాష్ట్రాల్లో మోహన్ బాబు తీరుపై జర్నలిస్ట్ సంఘాలు నిరసనలు తెలియజేస్తూ నాలుగు రోజులుగా ధర్నాలు, ర్యాలీలు నిర్వహిస్తున్నాయి.

Leave a Comment

Vedika Media