ఢాకా: బంగ్లాదేశ్‌లో హిందువులపై జరుగుతున్న హింసాకాండ ఇప్పట్లో ఆగిపోయే సూచనలు కనిపించడం లేదు. తాజాగా ఒక ఇస్కాన్ సెంటర్‌కు నిప్పు పెట్టారు. అక్కడి లక్ష్మీనారాయణ విగ్రహానికి నిప్పంటించారని సమాచారం. ఆలయంలోని వస్తువులు కాలిబూడిదయ్యాయి. ఆలయంపైనా దాడి జరిగింది. నమ్హట్టాలోని ఇస్కాన్ సెంటర్లో ఈ ఉదంతం చోటుచేసుకుంది. హిందూ దేవాలయాలే లక్ష్యంగా ఛాందసవాదులు ఈ దాడులకు పాల్పడుతున్నారు.
మహ్మద్ యూనస్ నేతృత్వంలోని బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వ పాలనలో అక్కడి మైనారిటీలపై, ముఖ్యంగా హిందువులపై నిరంతరం దాడులు జరుగుతూనే ఉన్నాయి. బంగ్లాదేశ్‌లో హిందువులపై పెరుగుతున్న హింసాత్మక ఘటనలపై భారత్‌లో వ్యతిరేకత అంతకంతకూ పెరుగుతోంది. ఇస్కాన్ సన్యాసి చిన్మోయ్ కృష్ణ దాస్ అరెస్ట్ తర్వాత బంగ్లాదేశ్‌లో పరిస్థితులు మరింత దిగజారాయి. హిందూ సమాజంపై ఛాందసవాదుల దాడులు పెరిగాయి. ఐక్యరాజ్యసమితి శాంతి మిషన్‌ను బంగ్లాదేశ్‌లో మోహరించాలని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అభ్యర్థించారు. సంహిత సనాతని జాగరణ్ జోట్ సభ్యుడు చిన్మయ్ కృష్ణ దాస్‌ను దేశద్రోహం ఆరోపణలపై నవంబర్ 25న ఢాకాలో అరెస్టు చేశారు. అక్టోబర్ 31 న హిందూ సమాజం చేపట్టిన ర్యాలీలో బంగ్లాదేశ్ జాతీయ జెండాను అవమానించారని చిన్మయ్ దాస్‌ను అరెస్టు చేశారు.