తెలంగాణ రాష్ట్రం చలితో గజగజా వణికిపోతోంది. గత ఆరేళ్లలో ఎన్నడూ లేనంతగా ఉష్ణోగ్రతలు పడిపోవడంతో ప్రజలు ఎముకలు కొరికే చలిని ఎదుర్కొంటున్నారు. ఉదయం, రాత్రి సమయాల్లో ఇళ్ల నుంచి బయటకు రావాలంటేనే జంకుతున్నారు. ఈ పరిస్థితికి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావం కారణమని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. రాష్ట్రంలో మరో రెండు నుంచి మూడు రోజులు చలి తీవ్రత కొనసాగనుందని హెచ్చరికలు జారీ చేశారు.
ఉత్తర తెలంగాణ పరిస్థితి మరింత దారుణంగా ఉండటంతో అక్కడ ఉష్ణోగ్రతలు మరింత తగ్గాయి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా భీంపూర్‌లో అత్యల్పంగా 6.3 డిగ్రీల సెల్సియస్ నమోదైంది. అలాగే, నిర్మల్ తాండ్రలో 6.6 డిగ్రీలు, ఆసిఫాబాద్‌లో 6.7 డిగ్రీలు, సంగారెడ్డిలో 6.8 డిగ్రీలు, కామారెడ్డిలో 7.6 డిగ్రీలు నమోదయ్యాయి. నిజామాబాద్, మెదక్, జగిత్యాల, వికారాబాద్, సిరిసిల్ల, సిద్దిపేట జిల్లాల్లో కూడా ఉష్ణోగ్రతలు 8 నుంచి 9.5 డిగ్రీల మధ్య నమోదవుతున్నాయి.
హైదరాబాద్ నగరంలో ఉష్ణోగ్రతలు:
హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. హెచ్‌సీయూ, మౌలాలీ ప్రాంతాల్లో 7.1 డిగ్రీలు, బీహెచ్‌ఈఎల్‌లో 7.4 డిగ్రీలు, గచ్చిబౌలిలో 9.3 డిగ్రీలు నమోదవగా, శివరాంపల్లి, జీడిమెట్ల, బాలానగర్, పటాన్‌చెరు ప్రాంతాల్లో 10 నుంచి 12 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మరికొన్ని ప్రాంతాల్లో గోల్కొండ, కూకట్‌పల్లి, లంగర్‌హౌస్, మాదాపూర్, సఫిల్‌గూడ ప్రాంతాల్లో 13.2 నుంచి 13.6 డిగ్రీల మధ్య చలితీవ్రత కొనసాగుతోంది.
చలి తీవ్రత కారణంగా రాత్రి 9 గంటల తర్వాత హైదరాబాద్ నగర రోడ్లు నిర్మానుష్యంగా మారిపోతున్నాయి. ఉదయం 7 గంటల వరకు బయటకు వెళ్లాలంటే ప్రజలు జంకుతున్నారు.
వాతావరణ శాఖ సూచనలు:
వాతావరణ శాఖ ప్రజలను అప్రమత్తంగా ఉండాలని, చలి నుండి రక్షణ కోసం తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. ముఖ్యంగా చిన్నపిల్లలు, వృద్ధులు చలిలో ఎక్కువగా బయటకు వెళ్లకుండా చూసుకోవాలని హెచ్చరించింది.