హైదరాబాద్‌లోని సంధ్యాధియేటర్ తొక్కిసలాట జరిగిన ఘటనలో అల్లు అర్జున్‌కు మంజూరైన బెయిల్‌ను సవాల్ చేస్తూ హైదరాబద్ పోలీసులు సుప్రీంకోర్టుకు వెళ్లాలని నిర్ణయించుకున్నారని తెలుస్తోంది. హీరో అల్లు అర్జున్‌కు మధ్యంతర బెయిల్ ఇవ్వడం సరైనది కాదనే క్వాష్ పిటిషన్‌పై వాదనల మధ్య అల్లు అర్జున్‌కు మధ్యంతర బెయిల్ ఎలా ఇస్తారని పోలీసుల తరపు న్యాయవాదులు సూటిగా ప్రశ్నిస్తున్నారు. ఇప్పుడు గనుక సవాల్ చేయకపోతే తర్వాత ఇతరత్రా కేసుల్లోనూ పోలీసులకు చిక్కులు ఎదురవుతాయని ఉన్నతాధికారులు అనుకుంటున్నారు.
ఈ నేపధ్యంలోనే అల్లు అర్జున్ మధ్యంతర బెయిల్ రద్దు చేయాలని కోరుతూ సుప్రీంకు వెళ్లాలని వారు నిర్ణయించారు. దీనిపై హైదరాబాద్‌లో డివిజన్ బెంచ్ లోనూ పిటిషన్ దాఖలు చేసేందుకు అవకాశం ఉంది. కానీ సుప్రీంకోర్టులో అయితే త్వరగా సమాధానం వస్తుందన్న ఉద్దేశంతో అక్కడే పిటిషన్ వేయాలని ఆలోచిస్తున్నారని సమాచారం. సంధ్యా ధియేటర్
తొక్కిసలాట ఘటనలో పోలీసుల నిర్లక్ష్యం స్పష్టంగా ఉందని అల్లు అర్జున్ తరపు న్యాయవాది వాదించారు. అయితే పోలీసుల సూచనలను అల్లు అర్జున్ పరిగణనలోకి తీసుకోలేదని నిరూపించే సాక్ష్యాలతో సుప్రీంకోర్టుకు వెళ్లాలని పోలీసులు అనుకుంటున్నారని సమాచారం.
తొక్కిసలాట ఘటనకు ధియేటర్ యాజమాన్యంతో పాటు అర్జున్ కూడా కారణమేనని పోలీసులు వాదిస్తున్నారు. టిక్కెట్లు కొనుక్కున్న వారిని తోసేసి అల్లు అర్జున్ తరపున వచ్చిన వారు దూసుకుపోయారని తెలుస్తోంది. అర్జున్ వ్యక్తిగత భద్రత సిబ్బంది అతి ప్రవర్తనతో మరిన్ని సమస్యలు వచ్చాయంటున్నారు. సుప్రీంకోర్టులో బెయిల్ రద్దు పిటిషన్ వేస్తే ఈ కేసు మరింత సంచలనంగా మారే అవకాశం ఉంది.